దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్... మీడియాకు ముఖం చాటేస్తున్న అధికారులు

బుధవారం, 20 మే 2020 (10:05 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. మార్చి 25వ తేదీ నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ.. వైరస్ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్టపడటం లేదు. ఫలితంగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో ఏకంగా మరో 5600కి పైగా కరోనా కేసులు పుట్టుకొచ్చాయి. 
 
మంగళవారం నాడు దేశవ్యాప్తంగా 5,611 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇదే సమయంలో 140 మంది ప్రాణాలు వదిలారని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,750కి పెరిగాయని, ప్రస్తుతం 61,149 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోందని పేర్కొంది. 
 
ఇప్పటివరకూ 3,303 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. నిన్న 3,124 మంది రికవరీ కాగా, మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 42,297కు పెరిగింది. రికవరీ రేటు 39.62 శాతానికి మెరుగుపడింది.
 
మరోవైపు, ప్రతి నిత్యమూ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను మీడియాకు తెలిపేందుకు సమావేశాలను ఏర్పాటు చేస్తూ వచ్చిన కేంద్రం, కేసుల సంఖ్య భారీగా పెరిగిన సమయానికి మీడియా సమావేశాలను నిలిపివేసింది.
 
మే 11న కేసులు 67,152కు చేరిన తర్వాత మీడియా సమావేశాలు నిలిపివేసి, కేవలం పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ వచ్చిన కేంద్రం, కేసుల సంఖ్య లక్షను అధిగమించిన వేళ, ఆ మాత్రం సమాచారాన్ని కూడా అందించలేదు. కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య శాఖ అధికారులు మీడియాకు దూరమయ్యారు.
 
ఇదే విషయమై ఆరోగ్య శాఖను వివరణ కోరగా, మీడియా సమావేశాలకు బదులుగా ప్రకటనలు విడుదల చేయాలన్నది విధానపరమైన నిర్ణయమని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. నిత్యమూ ప్రభుత్వం తరపున వివరాలను అందిస్తున్నామని తెలిపారు. 
 
కాగా, సుప్రీంకోర్టు సైతం కరోనాపై తన ఆదేశాల్లో మహమ్మారిపై స్వేచ్ఛగా చర్చలు జరిపి సమాచారాన్ని ప్రజలకు అందించవచ్చని, ఈ విషయంలో తాము కల్పించుకోలేమని స్పష్టం చేస్తూ, కేసుల విషయంలో మాత్రం అధికారిక సమాచారాన్నే తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా నిత్యమూ మీడియా బులెటిన్‌లను విడుదల చేయాలని, ప్రజల్లోని అనుమానాలను నివృత్తి చేయాలని సూచించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు