డబుల్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ : ఇంగ్లండ్ ముంగిట 557 విజయలక్ష్యం

వరుణ్

ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (14:52 IST)
రాజ్‌కోట్ వేదికగా భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేశారు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్‌ల సాయంతో 214 పరుగులు చేశాడు. అతడితోపాటు శుభ్‌మన్ గిల్ (91), సర్ఫరాజ్‌ ఖాన్ (68 నాటౌట్) హాఫ్‌ సెంచరీలు చేశారు. దీంతో భారత్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 430/4 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. ఫలితంగా ఇంగ్లండ్ ఎదుట భారత క్రికెట్ జట్టు 557 పరుగులు భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 445 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ 319 రన్స్‌కే ఆలౌటైంది. భారత్‌కు 126 పరుగుల మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే.
 
కాగా, మూడో రోజు ఓవర్‌నైట్‌ 196/2 స్కోరుతో నాలుగో రోజును ప్రారంభించిన భారత్‌ దాదాపు గంటపాటు వికెట్ కోల్పోలేదు. కానీ, కుల్‌దీప్‌తో (27)  సమన్వయలోపం కారణంగా శుభ్‌మన్‌ గిల్ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. వెన్ను నొప్పి కారణంగా రిటైర్డ్‌ హర్ట్‌ ప్రకటించిన యశస్వి మళ్లీ క్రీజ్‌లోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే దూకుడుగానే ఆడాడు. అయితే, మరికాసేపటికే నిలకడగా ఆడిన కుల్‌దీప్‌ ఔటయ్యాడు. దాదాపు 15 ఓవర్లపాటు క్రీజ్‌లో ఉండటం విశేషం. 258/4 స్కోరుతో ఉన్న సమయంలో యశస్వికి తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించిన సర్ఫరాజ్‌ జతకలిశాడు. 
 
ఇంగ్లాండ్‌కు బజ్‌బాల్‌ క్రికెట్ రుచి చూపిస్తూ బౌండరీలతో హోరెత్తించారు. కేవలం 26 ఓవర్లలోనే ఐదో వికెట్‌కు 172 పరుగులు జోడించారు. ఈ క్రమంలో యశస్వి తన కెరీర్‌లో రెండో డబుల్‌ సెంచరీ, సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే రెండో హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నారు. ఇంగ్లండ్‌ ఎదుట లక్ష్యం 550+ దాటడంతో భారత సారథి రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసినట్లు ప్రకటించాడు. 
 
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. ప్రస్తుతం 7 మ్యాచుల్లో 861 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆసీస్‌ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా (855) ఉన్నాడు. 
 
భారత్‌ ప్రతి ఇన్నింగ్స్‌లోనూ 400+ స్కోరు చేయడం ఇది మూడోసారి. 2005లో పాక్‌పై (407, 407/9), 2009లో శ్రీలంకపై (426, 412/4) సాధించింది. 
 
ఒక సిరీస్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన తొలి జట్టుగా తన రికార్డునే భారత్‌ అధిగమించింది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 48 సిక్స్‌లను భారత్ కొట్టింది. అంతకుముందు దక్షిణాఫ్రికాపై 47 సిక్స్‌లు బాదారు. 
 
భారత్‌ తరపున టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతివాటం బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు.  ఇంతకుముందు గంగూలీ (535) పేరిట ఉన్న రికార్డును యశస్వి (545) అధిగమించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు