జైలులో ఉంటూ చక్రం తిప్పుతున్న లాలూ.. సత్సంప్రదాయానికి ఆర్జేడీ శ్రీకారం!

సోమవారం, 5 అక్టోబరు 2020 (16:00 IST)
బీహార్ రాష్ట్ర శాసనసభకు మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ - ఆర్జేడీతో పాటు.. మరికొన్ని పార్టీలు కలిసి మహాకూటమిగా అవతరించాయి. ఈ క్రమంలో బీహార్‌లో ఒకపుడు చక్రం తిప్పిన రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ ఇపుడు ఓ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ తరహా నిర్ణయం తీసుకోవడం వెనుక గడ్డి స్కామ్‌లో ముద్దాయిగా తేలిన ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉంటూనే చక్రం తిప్పుతున్నారు. సీట్ల కేటాయింపు దగ్గర నుంచి పొత్తులు, ప్రచార వ్యూహాలను ఆయన రచిస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఆర్జేడీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. అందులో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అధిష్టానం టిక్కెట్ నిరాకరించింది. రాజ్‌వల్లభ్ యాదవ్ అనే నవాడా సిట్టింగ్ ఎమ్మెల్యే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా టిక్కెట్ ఇవ్వలేమని అధిష్ఠానం తెగేసి చెప్పేసింది. అయితే, ఆ స్థానంలో ఆయన భార్య విభాదేవిని అభ్యర్థిగా పోటీకి దించింది. 
 
అలాగే, మరో సిట్టింగ్ ఎమ్మెల్యేకు కూడా ఆర్జేడీ టిక్కెట్ నిరాకరించింది. అరుణ్ యాదవ్ (సందేశ్ నియోజకవర్గం) అనే ఎమ్మెల్యే కూడా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన భార్య కిరణ్ దేవికి అధిష్ఠానం ఛాన్స్ ఇచ్చింది. ఈ సత్సంప్రదాయం తుది జాబితా వరకూ కొనసాగుతుందా? లేదా? అన్నది ఆసక్తికర అంశం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు