రైతులతో కేంద్ర మంత్రుల చర్చలు... తాత్కాలికంగా ఛలో ఢిల్లీ వాయిదా

వరుణ్

సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (12:29 IST)
తమ డిమాండ్ల సాధన కోసం ఛలో ఢిల్లీ పేరిట రైతులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్రతరం కాకముందే కేంద్రం మేల్కొంది. రైతులతో చర్చలు, సంప్రదింపులకు దిగింది. ఆదివారం రైతులు - కేంద్ర మంత్రుల మధ్య నాలుగో విడత చర్చలు జరిగాయి. ఈ చర్చలు ఆదివారం సాయంత్రం 8.15 గంటలకు ప్రారంభమై ఆదివారం అర్థరాత్రి ఒంటి గంట వరకు సాగాయి. ఈ చర్చల్లో కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌లు పాల్గొన్నారు. అలాగే, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ సైతం పాల్గొన్నారు. 
 
రైతులతో సమావేశం తర్వాత కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ విలేకరులతో మాట్లాడుతూ, రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని తమ బృందం ప్రతిపాదించినట్లు చెప్పారు. కందులు, మినుములు, మైసూర్ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్సీసీఎఫ్, ఎన్ఎఫ్ఎస్ఈడీ వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయని తెలిపారు. కొనుగోలు చేసే పరిమాణంపై ఎటువంటి పరిమితి ఉండదన్నారు. 
 
దీని కోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. తమ ప్రతిపాదనల వల్ల పంజాబ్‌లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుందని తెలిపారు. భూగర్భ జలమట్టాలు  మెరుగవుతాయన్నారు. సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయని చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై రైతు నేత శర్వాన్ సింగ్ పంథేర్ స్పందించారు. దీనిపై సోమ, మంగళవారాల్లో తమ సంఘాలతో చర్చిస్తామన్నారు. నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. దీనిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. 
 
ప్రస్తుతానికి ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిలిపివేశామని, ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే ఈ నెల 21వ తేదీన తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 8, 12, 15న జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం తేలకుండా ముగిసిన విషయం తెలిసిందే. ఢిల్లీ చలో పేరిట దేశ రాజధానిలోకి ప్రవేశించేందుకు వచ్చిన రైతులను పోలీసులు ఫిబ్రవరి 13న శివారులోని శంభు, ఖనౌరీ ప్రాంతంలో అడ్డుకున్నారు. అప్పటి నుంచి వారు అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. 
 
సంయుక్త కిసాన్ మోర్చా (నాన్-పొలిటికల్), కిసాన్ మద్దూర్ మోర్చా ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. కనీస మద్దతు ధరపై చట్టంతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులు, వ్యవసాయ కూలీలకు పింఛన్లు, పంట రుణాల మాఫీ, విద్యుత్ ఛార్జీలపై టారిఫ్ల పెంపు నిలుపుదల, 2021 నిరసన సమయంలో రైతులపై నమోదైన కేసుల ఎత్తివేత, అప్పటి ఆందోళనల్లో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం, భూసేకరణ చట్టం 2013 పునరుద్ధరణ వంటివి అన్నదాతల డిమాండ్లలో ప్రధానమైనవిగా ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు