"హమ్ దో... హమారే దో"... పటేల్ స్టేడియంకు మోడీ పేరు : రాహుల్ ధ్వజం

గురువారం, 25 ఫిబ్రవరి 2021 (07:39 IST)
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో నిర్మించారు. ఈ స్టేడియాన్ని బుధవారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రారంభించారు. మొతేరా స్టేడియంగా పేరుగాంచిన దీని అసలు పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం. 
 
అయితే ఈ స్టేడియంను పునర్నిర్మించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పేరు పెట్టారు. అదీకూడా రాష్ట్రపతి ప్రారంభించిన తర్వాత స్టేడియం పేరు మార్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీసీసీఐ కార్యదర్శి జై షా (అమిత్ షా కుమారుడు), కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. 
 
అయితే, స్టేడియంకు సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఉండగా, దాన్ని నరేంద్ర మోడీ స్టేడియంగా పేరు మార్చడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. అసలైన నిజం దానంతట అదే బయటపడటం చాలా బాగుందని ఆయన అన్నారు. 'నరేంద్ర మోడీ స్టేడియం, అదానీ ఎండ్, రిలయన్స్ ఎండ్, కార్యక్రమానికి హాజరైన జై షా' అంటూ ట్విట్టర్ ద్వారా ఎద్దేవా చేశారు.
 
భారతదేశ కుబేరులైన ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ ఇద్దరూ గుజరాత్‌కు చెందినవారే. వీరిద్దరికీ మోడీ, అమిత్ షాలు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రాహుల్ కొంత కాలంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. మోడీ, అమిత్ షాలు అంబానీ, అదానీలకు మాత్రమే మేలు చేసేలా పాలిస్తున్నారని అర్థం వచ్చేలా 'హమ్ దో.. హమారే దో' అనే నినాదాన్ని ఇటీవలి కాలంలో రాహుల్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈరోజు చేసిన ట్వీట్‌ను కూడా అదే ఉద్దేశంతో చేశారు.

 

Beautiful how the truth reveals itself.

Narendra Modi stadium
- Adani end
- Reliance end

With Jay Shah presiding.#HumDoHumareDo

— Rahul Gandhi (@RahulGandhi) February 24, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు