నాకు అవకాశాలు సన్నగిల్లడానికి ఆ బాలీవుడ్‌ గ్యాంగే కారణం.. #ARRahman

ఆదివారం, 26 జులై 2020 (10:22 IST)
AR Rahman
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్. జయహో పాట ద్వారా పాపులర్ అయిపోయిన రెహ్మాన్.. ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌, టాలీవుడ్, కోలీవుడ్‌ అనే తేడా లేదు.. ప్రతి చోట తనదైన సంగీతంతో గుర్తింపు పొందారు. అయితే బాలీవుడ్‌లో ప్రస్తుతం చాలా తక్కువ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. ఇంత ప్రతిభ ఉన్న సంగీత దర్శకుడు ఎందుకు ఎక్కువ సినిమాలు చేయట్లేదని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్కున్నారు. 
 
ఇందుకు ఓ ఇంటర్వ్యూలో రెహ్మాన్ సమాధానం ఇచ్చారు. తనకు అవకాశాలు రాకపోవడానికి బాలీవుడ్‌కి చెందిన ఓ గ్యాంగ్ కారణమన్నట్లు వ్యాఖ్యానించారు. ఇప్పటికే బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ బలవన్మరణానికి నెపోటిజం కారణమంటూ వార్తలొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెహమాన్‌ సంగీతం అందించిన సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ నటించిన ఆఖరి చిత్రం 'దిల్‌ బెచారా' చిత్రం తాజాగా ఓటీటీ వేదికగా విడుదలైంది. 
 
ఈ సందర్భంగా తనకు అవకాశాలు సన్నగిల్లడానికి బాలీవుడ్ గ్యాంగే కారణమని రెహ్మాన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇకా ఆయన మాట్లాడుతూ.. ''నేనెప్పుడు మంచి సినిమాలకు నో చెప్పలేదు. కానీ బాలీవుడ్‌లో ఓ గ్యాంగ్‌ ఉంది. అపార్థాలతో తప్పుడు ప్రచారాలు చేస్తోంది. 'దిల్‌ బెచారా' దర్శకుడు ముఖేశ్‌ చబ్రా నా దగ్గరకు వచ్చినప్పుడు రెండు రోజుల్లో నాలుగు పాటలు ఇచ్చాను. 
 
రెహమాన్‌ వద్దకు వెళ్లొద్దని చాలా మంది చాలా రకాలుగా అతడికి చెప్పారట. అప్పుడే అర్థమైంది. మంచి సినిమాలు నా వరకు ఎందుకు రావట్లేదో. ఓ గ్యాంగ్‌ నాకు వ్యతిరేకంగా పనిచేస్తోందని తెలిసింది. నా నుంచి మరిన్ని పాటలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ కొందరు నన్ను ఆ పని చేయనీయకుండా అడ్డుకుంటున్నారు.అయినా ఫర్వాలేదు. 
 
నేను విధిని, దేవుణ్ని నమ్ముతా. కాబట్టి నా వద్దకు వచ్చిన సినిమాలు చేస్తూ.. ఇతర పనులు చక్కబెట్టుకుంటున్నా.అలాగే అందరినీ ఆహ్వానిస్తున్నాను. మంచి సినిమాలతో నా వద్దకు రండి'' అని రెహమాన్‌ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు