ఎన్ని భాషలు నేర్చుకున్నా మనిషిగా ముందుకు నడిపేది మాతృభాషే : ఎం.వెంకయ్య నాయుడు

ఆదివారం, 5 నవంబరు 2023 (22:44 IST)
తెలుగు సినిమా ప్రపంచంలో ప్రత్యామ్నాయం లేని నటుల్లో సూర్యకాంతం మొదటి వరుసలో ఉంటారని, వారి ఆహార్యాన్ని, వాచకాన్ని అనుకరించటం కూడా కష్టమేనని భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సూర్యకాంతం నటలో సూర్యకాంతిలో ఉండే తేజస్సుతో పాటు, ఆమె మాటల్లో సూర్యకాంతిలోని వేడి - వాడి కనిపిస్తాయని, గుండమ్మకథ లాంటి చిత్రానికి ఆమె పాత్ర పేరు పెట్టడమే వారికి సినీరంగం ఇచ్చిన ప్రాధాన్యతను తెలియజేసిందని ఆయన తెలిపారు. 
 
సూర్యకాంతం గారి శతజయంతిని పురస్కరించుకుని చెన్నైలోని ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్‌లో జరిగిన శతజయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకయ్యనాయుడు, "తెలుగింటి అత్తగారు" పుస్తకాన్ని ఆవిష్కరించారు. సూర్యకాంతం శతజయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించిన ఆయన, చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సూర్యకాంతం కుమారుడు అనంత పద్మనాభమూర్తిని అభినందించారు.
 
నాటకరంగం నుంచి సినీరంగంలో ప్రవేశించి, తమ ప్రత్యేక ప్రతిభా విశేషాలతో ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న సూర్యకాంతం జీవితం పరిపూర్ణమైనదన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిందని తెలిసి నాడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత, తమ అధికారిక కార్యక్రమాన్ని కూడా అర్థాంతరంగా రద్దు చేసుకుని వచ్చి, వారి పార్థివదేహాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. తల్లిలాగా ఆదరించి తనకు అన్నం పెట్టిన విషయాన్ని జయలలిత చెప్పారన్న ఆయన, అందరూ అమ్మ అని పిలిచే జయలలితకే సూర్యకాంతం గారు అమ్మగా మారారని పేర్కొన్నారు. 
 
సినీ రంగానికి చెందిన ధృవతారలు ఘంటసాల, ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, సూర్యకాంతం గారి శతజయంతులు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో వారి నట వైభవాన్ని స్మరించుకుని, ముందు తరాలకు తెలియజేసే తరుణమని ఆయన పేర్కొన్నారు.
 
సూర్యకాంతం గారి నటన గురించి వారి పాత్రలే మాట్లాడతాయన్న వెంకయ్యనాయుడు, నటిగా పాత్రల్లో ఆమె కఠిన మనసు గల పాత్రల్లో నటించినా వ్యక్తిగతం జీవితంలో మాత్రం వారి పరిణతి గలిగిన వ్యక్తిత్వం కలవారని తెలిపారు. ఎదుట ఎలాంటి నటులున్నా సూర్యకాంతం గారు ప్రవేశిస్తే అన్నీ ఆమె అన్నంతంగా సన్నివేశాలు రక్తి కట్టేవన్న ఆయన, కొన్ని సమయాల్లో సూర్యకాంతం గారికి మాటలు రాసే అవసరం కూడా రచయితలకు ఉండేది కాదని, ఆమె ఎడమచేయి ఊపుతూ గదమాయిస్తే... ఆ సహజ నటనకే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవారని తెలియజేశారు. సూర్యకాంతం అనే పేరును తెలుగు ప్రజలు తమ పిల్లలకు పెట్టుకోవడానికి భయపడతారంటే... ఆమె పాత్రల ప్రభావం ప్రజల మీద ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
 
ఆరోగ్యం సహకరించినంత కాలం నటిస్తూనే ఉన్న సూర్యకాంతం గారి వ్యక్తిగత జీవితాన్ని ఈతరం ఆడపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలన్న  ముప్పవరపు వెంకయ్యనాయుడు, చదువుకోవాని ఆమె ప్రయత్నించిన తీరు ఆదర్శనీయమైనదన్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందిస్తే... తనకు వచ్చిన అవార్డుల్లో ప్రేక్షకాభిమానం, డాక్టరేట్ గొప్పవి అని చెప్పుకోవటం వారికే చెల్లిందన్నారు. ఆమె చేసిన గుప్తదానాలు, సొంత ఊరిని మరువకపోవటం, నలుగురి ఆకలి తీర్చటం వంటివి ఆదర్శనీయమైనవని తెలిపారు. సేవలో దొరికే సంతృప్తి అనుభవైక వేద్యమైనదన్న ఆయన, సాటివారి సేవలో ప్రతి ఒక్కరూ సంతృప్తి పొందవచ్చన్నారు. సాటి మనుషులతో పాటు ప్రకృతిని ప్రేమించటం, మూగజీవాల పట్ల దయతో మెలగటం వంటివి మనిషికి మాత్రమే సాధ్యమయ్యే అద్భుత వరాలని పేర్కొన్నారు.
 
తెలుగు సినిమా అత్యంత ప్రభావ మాధ్యమన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, దాన్ని యోధుడి చేతిలో ఆయుధంలా నైపుణ్యంతో వినియోగించాలన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, గతానికి వర్తమానానికి మధ్య వారధి నిర్మించే బాధ్యత సినిమా మీద ఉందని, నాటి సినీ పెద్దలు వేసిన సానుకూల పునాదుల మీద భాషా సంస్కృతులకు పెద్ద పీట వేసే సినిమాలు రావాలని ఆకాంక్షించారు. ఇటీవల నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, మన భాషా సంస్కృతులను ఆవిష్కరించిన ఆ పాటకు వచ్చిన అవార్డు, ఆత్మన్యూనతను విడనాడాలని మనకు తెలియజేస్తుందని పేర్కొన్నారు. మన భాషా సంస్కృతులను కాపాడుకుని, మన గుర్తింపును సగర్వంగా ప్రకటించినప్పుడు ప్రపంచం కూడా దాన్ని గుర్తించి, గౌరవిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎన్ని భాషలు నేర్చుకున్నా మనిషిగా మనల్ని ముందుకు నడిపేది మాతృభాషే అని పేర్కొన్నారు.
 
ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, విజయా ప్రొడక్షన్స్ నిర్వాహకులు కె.విశ్వనాథ రెడ్డి, ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బారెడ్డి, అలనాటి నటీమణులు రాజశ్రీ, జయచిత్ర, ఆర్కిటెక్స్ ఆదిశేషయ్య, సూర్యకాంతం గారి కుమారుడు ఆనంత పద్మనాభమూర్తి సహా వారి కుటుంబ సభ్యులు, సూర్యకాంతం గారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సూర్యకాంతం శతజయంతి కమిటీ సభ్యులు డాక్టర్ తుమ్మపూడి కల్పన, గుడిమెళ్ళ మాధూరి, కొమ్మరాజు శివరామకృష్ణ, మీడియా సలహాదారుడు గుర్రం బాలాజీలు, అనేక మంది పురప్రముఖులు, తెలుగు భాషాభిమానులు, సూర్యకాంతం అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు