సైకిల్ పైన నా సీట్లు సరిపోవడంలేదు.. దిగేస్తున్నా... తెదేపాకు మరో షాక్..

శనివారం, 16 జూన్ 2018 (11:52 IST)
అయిష్టంగానే తెలుగుదేశం పార్టీలో చేరిన నెల్లూరు జిల్లా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆ పార్టీని వీడే స‌మ‌యం ఆస‌న్న‌మ‌యిన‌ట్లుంది. త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టేశారు. ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులకు తేల్చి చెప్పేశారు. ఆనం రాజకీయ గమనంపై కొంతకాలంగా ఊహాగానాలు కొనసాగుతూ ఉన్న విషయం తెలిసిందే. ఆయన తెదేపాను వీడి వైకాపాలో చేరతారనే ప్రచారం కొంతకాలంగా ఉంది. దానికితోడు జిల్లా మహానాడు, విజయవాడ మహానాడులకు ఆయన గైర్హాజరవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకొంది. 
 
ఈ క్రమంలో ఆయన ఆత్మకూరు నియోజకర్గంలోని మండలాల ముఖ్య నాయకులను పిలిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపాలో ఇంక ఇమడలేమని, వీడాలని నిర్ణయించుకొన్నట్లు వివరించారు. అందుకు దారితీసిన కారణాలు వివరించారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికల బరిలో ఉంటానని ఈ విషయంలో అపోహ వద్దని నాయకులకు తేల్చి చెప్పారు. ఏ పార్టీలో ఎప్పుడు ఎలా చేరాలనే విషయం ఈ నెల 20వ తేదీన ఏర్పాటు చేసే ప్రత్యేక సమావేశంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరితో మాట్లాడి నిర్ణయిస్తామని తెలిపారు. ఆయ‌న వైసిపిలో చేరే అవ‌కాశాలున్నాయి. 
 
తెలుగుదేశం పార్టీలో ఆనం కుటుంబానికి పెద్ద‌గా ప్రాధాన్య‌త ల‌భించ‌లేదు. ఒక‌వైపు సోమిరెడ్డి, మ‌రోవైపు నారాయ‌ణ‌లు మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకోగా…. ఆనం ఏ ప్రాధాన్య‌తా లేకుండా ఉండిపోయారు. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత ఇబ్బంది త‌ప్ప‌దు. అందుకే ఆయ‌న పార్టీ వీడాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆనం రామనారాయణరెడ్డి సోద‌రుడు ఆనం వివేకానంద‌రెడ్డి అనారోగ్యంతో ఇటీవ‌లే మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. తన సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ఆప్తమిత్రులు, తాను ఏ పార్టీలోకి వెళితే ఆ పార్టీలోకి వచ్చి తనకు సహకరించే కార్యకర్తలతో చర్చలు జరిపిన తరువాత చివరగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలన్న నిర్ణయంలో ఉన్నారు ఆనం రాంనారాయణరెడ్డి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు