ఆంధ్రప్రదేశ్ సీఎం ఓ ట్రెండ్ సెట్టర్: మంత్రి మేకపాటి
సోమవారం, 2 మార్చి 2020 (05:26 IST)
ప్రజలకు మంచి చేయాలన్న మనసున్న ముఖ్యమంత్రి..మంచి పేరు తెచ్చుకోవాలనే సేవా గుణం కలిగిన లక్షలాది మంది వాలంటీర్ల సైన్యం వెరసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ట్రెండ్ సెట్ చేసిందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.
పింఛన్ల పంపిణీలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 3వ స్థానంలో నిలిచేలా సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి మేకపాటి అభినందనలు వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులోనే సుమారు అరకోటి మందికి లబ్దిదారులకు పింఛన్లను అందజేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మరో రికార్డు నెలకొల్పిందని మంత్రి స్పష్టం చేశారు.
రోజంతా వరుసలో నిలబడితేగానీ వస్తుందో రాదో అని ఆందోళన చెందే పరిస్థితికి ముగింపు పలుకుతూ సరాసరి ఇంట్లో ఉన్నా, అనారోగ్యంతో వైద్యాశాలలో ఉన్నా, ఎక్కడున్నా సరే అక్కడికే వెళ్లి పింఛన్లు అందిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని వృద్ధులు మనసారా ఆశీర్వదిస్తున్నారని మంత్రి అన్నారు.
గంటలు గంటలు నిలబడకుండా, కనీసం ఇంటి నుంచి బయటకు కూడా వెళ్లకుండా పింఛన్ అందుకుంటున్న వారి ముఖాల్లో సంతోషాన్ని మాటల్లో చెప్పలేని విధంగా ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
నెల్లూరు జిల్లాలో పింఛన్ల పంపిణీపై మంత్రి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలో తొలి రోజే 90 శాతం మందికి అంటే 3,05,272 మందికి పింఛన్లు అందించడంపై వాలంటీర్లు, జిల్లా యంత్రాంగానికి మంత్రి మేకపాటి అభినందనలు తెలిపారు.
ముఖ్యంగా తన ఆత్మకూరు నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ ఎలా ఉందన్నదానిపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెల్లవారు జామునే కోడికూయక ముందే వెళ్లి అంకితభావంతో పింఛన్ అందిస్తోన్న వాలంటీర్ల సేవకు ఎంత పొగిడినా తక్కువేనని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.
రాజకీయమే తప్ప వేరేవి పట్టని ప్రతిపక్షాలు వలంటీర్ల వ్యవస్థను విమర్శించారని, కానీ ఇపుడు ఆ వాలంటీర్లకు ఉన్న గౌరవం, ప్రజల సంతృప్తి వారికి కళ్లు తెరిపిస్తాయనడానికి ఇదే నిదర్శనమని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు.
అవినీతి ఆస్కారం లేకుండా, ఆలస్యానికి తావు లేకుండా ఒక రోజులో పక్కాగా పింఛన్లు అందించడంలో భాగస్వామ్యమైన వాలంటీర్లు, అధికారులు, గ్రామసచివాలయ సిబ్బందికి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.