ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మెట్టుదిగారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో సర్దుకునిపోయారు. దీంతో ఆదివారం అర్థరాత్రి నుంచి చేపట్టాల్సిన నిరవధిక సమ్మెను విరమించుకున్నారు. ఈ విషయాన్ని శనివారం పీఆర్సీ సాధన సమితి నేతలు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఉపాధ్యాయులు మాత్రం గుర్రుగా ఉన్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ పీఆర్సీ సాధన సమితి ఉద్యమ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నిరసనను తెలిపేలా శనివారం నిర్వహించిన మీడియా సమావేశాన్ని బహిష్కరించారు.
ప్రభుత్వానికి ఉద్యోగుల ప్రేమ ఏంటో నిరూపితమైంది. ఐదు డీఏలను ఒకేసారి ఇవ్వడం చాలా గొప్ప నిర్ణయం అని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి వెంకట్రామిరెడ్డి అన్నారు. పీఆర్సీ జీవోల జారీ తర్వాత అన్ని అంశాలు మరుగునపడ్డాయి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సమ్మెకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు అని చెప్పారు.