రావెల కిశోర్ బాబు గిటారిస్టుగా మారిపోయారు.. స్టెప్పులేశారు.. కెవ్వుకేక..

మంగళవారం, 16 ఆగస్టు 2016 (14:40 IST)
ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు గిటారిస్టుగా మారిపోయారు. అసలు విషయం ఏంటంటే... గుంటూరు జిల్లా సత్తెన పల్లి మండలం గురుకుల పాఠశాలలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో రావెల పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న రావెల అక్కడ ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాలోని గిటార్‌ని వాయించి, విద్యార్థులతో కలసి డాన్స్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఆయన గిటార్ వాయించి, స్టెప్పులేయడం చూసిన ప్రజలు, విద్యార్థులు ఈలలు వేసి ఆయన్ని ఉత్సాహపరిచారు. అనంతరం చిన్నారులు పాడిన పాటకు గిటారు వాయించారు. 
 
తనదైన శైలిలో గిటారు వాయించి ఆయనలోని మరో కళాకారుడిని బయటికి రప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాఠశాలల్లో ఈ తరహా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వల్ల విద్యార్థుల్లో ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతాయని, ఆ ప్రభావం విద్యాభ్యాసంపై సానుకూల ప్రభావం చూపుతుందని చెప్పారు.

విద్యార్థులంతా దేశ సేవలో ముందుండాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ జాతీయత భావాన్ని పెంపొందించుకోవాలని.. విద్యార్థి దశ నుంచే దేశ సేవలో భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. రావెల ఇంత బాగా గిటార్ వాయించగలరని తాము ఊహించలేదని పలువురు పొగడ్తల వర్షాన్ని కురిపించారు.

వెబ్దునియా పై చదవండి