ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజానీకంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆగ్రహజ్వాలలకు చంద్రబాబు స్వయంకృతాపరాధమే తప్ప మరేదీ కారణం కాదన్నది వాస్తవం. రేపేంది అని ఒక నాటకంలో పాత్రధారి అడిగినట్లుగా ఈ రోజు విశాఖ తీరంలో ఏం జరగనుందనే ప్రశ్న అటు బాబును, టీడీపీనీ, రాష్ట్ర ప్రజానీకాన్ని కలవరపరుస్తున్న సమయంలో బాబుకు ఇవ్వాళ ఎదురవుతున్నది నిజమైన అగ్ని పరీక్షే. ఆర్కే బీచ్ లోకి ఎవరడుగు పెడతారో చూస్తాం అని విశాఖ పోలీసులు ఇప్పటికే సవాలు విసిరిన నేపథ్యంలో చంద్రబాబు తనకు తానుగా కోరి తెచ్చుకున్న ఈ అగ్నిపరీక్షలోంచి బయటపడతారా, ఎలా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం తనవల్లే సాధ్యమవుతుందని మొదట ప్రచారం చేసుకున్న చంద్రబాబు ఆ తర్వాత కాలంలో మాట మార్చడం ప్రారంభించిన విషయం తెలిసిందే. చంద్రబాబు తన బలహీనతల కారణంగా ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయలేని పరిస్థితి రావడంతో దశల వారీగా హోదా అంశాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. హోదా ఇవ్వడం వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనాలు ఉండవని, అందరూ చెబుతున్నట్టు పారిశ్రామిక రాయితీలేవీ రావని... దానికన్నా ప్యాకేజీ వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పడం ప్రారంభించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ప్రతిపక్షం ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి రెండున్నరేళ్లకు పైగా అనేక రూపాల్లో పోరాటాలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన హోదా డిమాండ్ చేస్తూ ఆందోళన చేసినప్పుడల్లా, హోదా కోసం తానేదో ప్రయత్నిస్తున్నట్టు చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం అక్కడ కేంద్రమంత్రులకు వినతిపత్రాలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు ప్రచారం చేసుకున్నారు. ఈ అంశంపై పార్లమెంటులో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నించినప్పుడు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించే అవకాశం లేదని కేంద్రం చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చింది. ఆ రోజుల్లో కూడా చంద్రబాబు కేంద్రంపై కిమ్మనకుండా ఉండిపోయారు.
చంద్రబాబుపై ఉన్న కేసులకు భయపడి ఆయన కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించడం లేదన్న విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ చాలంటూ కొత్త పాట అందుకున్నారు. హోదా కన్నా మెరుగైన ప్యాకేజీని కేంద్రం నుంచి తీసుకుంటామన్నారు. అలాగే కేంద్రం కోట్లాది నిధులు విడుదల చేసినట్టుగా ఢిల్లీ వెళ్లి నానా హడావిడి కూడా చేశారు. హోదా వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటూ సవాలు కూడా విసిరారు.
ఎన్నికల తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరడమే కాకుండా కేంద్రం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతిస్తూ వచ్చారు. ప్రత్యేకంగా ఓటుకు నోట్లు కేసు తెర మీదకు వచ్చిన తర్వాత కేంద్రంలోని బీజేపీ పట్ల చంద్రబాబు మరింత సానుకూలంగా మారిపోయారు. ఆ తరుణంలోనే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించినా ఆయన పట్టించుకోలేదు.
అయితే, తాజాగా జల్లికట్టు విషయంలో తమిళనాడులో ఉద్యమ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హక్కు, ప్రాణప్రదమైన ప్రత్యేక హోదాను సాధించుకోవాలన్న ఆకాంక్ష ప్రజల్లో మరింత బలంగా పెరిగిపోయింది. గడిచిన రెండున్నరేళ్లుగా ఉద్యోగాలు కల్పించలేక, ఉపాధి అవకాశాలు మెరుగుపడకపోగా నిరుద్యోగ యువకులు మరింత నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు. చంద్రబాబు చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన కనిపించడం లేదని గడిచిన రెండున్నరేళ్ల కాలంలో నిరూపితమైంది.
సరిగ్గా ఇదే సమయంలో వచ్చిన జల్లికట్టు ఉద్యమం ప్రజల్లో మరీ ముఖ్యంగా యువకుల్లో స్పూర్తిని నింపింది. సామాజిక సాధనాల ద్వారా ప్రత్యేక హోదాపై యువకులు నిరసన గళం విప్పడం, అందుకు ప్రతిపక్షాలు ప్రధానంగా ఈ డిమాండ్ పై మొదటి నుంచి పోరాటం సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించడం... చంద్రబాబుకు మింగుడు పడటం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
అటు కేంద్రాన్ని గట్టిగా అడగలేక, ఇటు ప్రజలను కన్విన్స్ చేయలేక... ఏం చేయాలో చంద్రబాబుకు అంతుబట్టడం లేదని అంటున్నారు. జల్లికట్టు కోసం జరిగిన ఆందోళన అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టిందని ఆ పార్టీ వారే చెప్పుకుంటున్నారు.
ప్రతిపక్షాల నుంచి కాకుండా కొత్తగా యువతీ యువకులనుంచి వస్తున్న ఈ సరికొత్త ఉపద్రవాన్ని డీల్ చేయడంలో ఏమాత్రం తప్పటడుగు వేసినా అది తన రాజకీయ భవితవ్యానికే ప్రమాదకరం అని బాబుకు అర్థమవుతోంది. ఒకటి రెండు రోజులు విద్యార్థులను ఆర్కే బీచ్ లోకి అనుమతిస్తే వారికి వారే శాంతిస్తారు, దీక్షలను ముగిస్తారు అనుకోవడానికి వీల్లేని పరిస్థితి. మెరీనా బీచ్‌లో తమిళ యువత జల్లికట్టు దీక్ష ఎంత పనిచేసిందో కళ్లముందు కనుబడుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనే అగమేఘాల మీద పరుగులెత్తించిన శక్తిని జల్లికట్టు ఉద్యమం ప్రదర్శించింది.
ప్రత్యేక హోదా డిమాండుపై చన్నీళ్లు చల్లినా మళ్లీ మళ్లీ అది రాజుకుంటోందంటే ప్రజలను అది ఎంత స్థాయిలో ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకుని ఉంటే చంద్రబాబు, టీడీపీ నేతలు ఇంత మొండివైఖరితో తాబట్టిన కుందేటికి మూడే కాళ్లు అనే మొండి వైఖరిని ప్రదర్శించి ఉండరు. ఏదేమైనా విశాఖ ఆర్కే బీచ్ వరకూ పాకిన ప్రత్యేక హోదా డిమాండ్‌కు ఇంత విస్తృత మద్దతు లభిస్తుండటం చంద్రబాబు స్వయంకృతాపరాధమే.
పోలీసు బలగాలను పిలిపించి, సాగరతీరాన్ని కాకీలతో నింపి నేడు ప్రభుత్వం తాత్కాలిక విజయం సాధించినా సాధించవచ్చు. కాని ఏపీ ప్రజల గుండెల్లో ముద్రించుకుపోయిన ప్రత్యేక హోదా భావనను కాకీమూకలు పెకిలించగలవా.. బలప్రయోగంతో పాలకులకు తాత్కాలిక శాంతిని చేకూర్చగలవేమో కాని ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించగలవా? ఇదే ఇప్పుడు ప్రశ్నా, జవాబు రెండూనూ.
విద్యార్థులు, యువజనులు దీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసు బలగాల అతి చర్యలు ఎలాంటి అవాంతర పరిస్థతులకూ దారి తీయకూడదని కోరుకోవడమే ఇప్పటి అవసరం.