గుడ్ జాబ్ హేమావతి, ప్రభుత్వం ఇచ్చిన రివార్డ్ డబ్బు పేదలకే

బుధవారం, 26 మే 2021 (19:12 IST)
రివార్డ్ ప్రకటించి డబ్బులు వస్తే ఏం చేస్తాం? వ్యక్తిగత అవసరాలకు వాడేసుకుంటాం. అది మామూలే. కానీ తిరుపతికి చెందిన వాలంటీర్ మాత్రం తనకు రివార్డ్ వచ్చినా సరే ఆ డబ్బును ఖర్చుపెట్టలేదు. నిరాశ్రయులు, అనాథలు, ప్రత్యేక ప్రతిభావంతులు నివాసముండే అక్షయక్షేత్రానికి ఆ డబ్బులను ఇచ్చేసింది. అంతేకాదు సేవామిత్ర పురస్కారాన్ని అందుకుని అందరి మన్ననలను అందుకుంటోంది.
 
తిరుపతి 8వ డివిజన్‌కు చెందిన వాలంటీర్ హేమావతిని నగర పాలకసంస్థ కమిషనర్ గిరీషా అభినందించారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ భరత్ గుప్త పంపిన అభినందన పత్రాన్ని కమిషనర్ అందజేశారు. మానవతా విలువలతో క్రమశిక్షణ, నిజాయితీగా ఉండి సంక్షేమ పథకాల పంపిణీలో చురుగ్గా వ్యవహరించారు హేమావతి. దీంతో హేమావతికి సేవామిత్ర పురస్కారాన్ని ప్రభుత్వం అందజేస్తూ 10 వేల రూపాయల నగదును ఇచ్చింది.
 
అయితే ఆ డబ్బును స్వంత అవసరాలకు హేమావతి ఉపయోగించకుండా అక్షయక్షేత్రానికి అందించారు. అక్షయక్షేత్రంలో తలదాచుకుంటున్న అభాగ్యులు, అనాధలు, ప్రత్యేక ప్రతిభావంతులకు స్వయంగా భోజనం చేసిపెట్టడంతో పాటు వారికి మాస్కులు, శానిటైజర్లను అందించింది హేమావతి. దీంతో వాలంటీర్ హేమావతిని అభినందించారు నగరపాలకసంస్ధ కమిషనర్ గిరీషాతో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు