కత్తి మహేష్ ఓ పట్టాన వదిలిపెట్టేట్లు లేరు. ఇటీవలే శ్రీరాముడిపై ఆయన చేసిన వ్యాఖ్యలతో హిందూ ధార్మిక సంఘాలన్నీ ఆయనపై మండిపడ్డాయి. ఆయన వ్యాఖ్యలపై పరిపూర్ణానంద స్వామి నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కత్తి మహేష్‌ను తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించి ఏపీకి తరలించారు. ఇక్కడ కూడా కత్తి మహేష్ కుదురుగా వుండటం లేదని చెపుతున్నారు.
వదిలినచోట వుండకుండా తన సొంతూరు యలమందకు వెళ్తున్నట్లు పీలేరు పోలీసులకు కత్తి మహేష్ తెలియజేశారు. కత్తి మహేష్ అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారు. అక్కడికి వెళితే హిందూ ధార్మిక సంఘాలు దాడి చేసే అవకాశం వున్నదనీ, వెళ్లేందుకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఐతే కత్తి మహేష్ మాత్రం తను వెళ్లి తీరాలంటూ పట్టుబట్టడంతో ఆయనను బలవంతంగా జీపు ఎక్కించుకుని బెంగళూరుకు తరలించారు.
మరోవైపు కత్తి మహేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వుండకూడదనీ, ఆయనను తెలుగు రాష్ట్రాల నుంచి బహిష్కరించాలంటూ డిమాండ్లు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరి కత్తి వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.