విజయవాడ: ల్యాండ్ పూలింగ్ అంటే కూల్‌గా భూములను లాక్కోవడం. ఇపుడు ఏపీలో ల్యాండ్ పూలింగ్ అంటే చాలు ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. మీరిస్తే... ల్యాండ్ పూలింగ్... మేం తీసుకుంటే... ల్యాండ్ అక్విజిషన్ అంటూ అధికారులు బెదిరిస్తున్నారు. నవ్యాంధ్ర వచ్చాక త్యాగాలు తప్పవు అని అధికార పార్టీ నేతలు చెపుతున్నారు గానీ, ఎవరికైనా సొంత భూమి పోతోందంటే, మనసు విలవిల్లాడుతుంది. ఇప్పటికే అమరావతి రాజధాని పేరిట 33 వేల ఎకరాల భూమిని పూలింగ్ పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటికీ అక్కడ రాజధాని నిర్మాణం ప్రారంభం కాలేదు.
రైతులకు ఎక్కడ పరిహారపు ప్లాట్లు ఇస్తారో తేల్చలేదు. ఏటా ఇస్తామన్న చెక్కులు రాక రైతులు సీఆర్డీఏ ఎదుట ధర్నాలు చేసే పరిస్థితి. ఇపుడు తాజాగా గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణ పేరిట భూమి పూలింగ్ చేస్తున్నారు. మీరిస్తే... పూలింగ్ మేం తీసుకుంటే ల్యాండ్ అక్విజిషన్. అపుడు మీరు చాలా కోల్పోతారు అంటూ అధికారులు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ కోసం దాదాపు వంద ఎకరాలకు పైగా భూమి సేకరిస్తున్నారు. దీనికోసం గన్నవరంలో సబ్ కలెక్టర్ లక్ష్మీశా రైతులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. పూలింగ్ పద్దతిలో మీ అంతట మీరు భూమి ఇచ్చేందుకు వారం మాత్రమే గడువు ఉంది. ఆ తర్వాత ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారం మీ భూముల్ని తీసేసుకుంటాం. ఇదే చివరి మీటింగ్... ఇక రైతులు పోరాటాలు చేసినా ఫలితం ఉండదు అంటూ హెచ్చరిస్తున్నారు.
విలువైన భూముల్ని మేం వదులుకోలేం అంటున్న రైతులు
ఇప్పటికే గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణకు, పోలవరం కాలువకు, ఎన్.హెచ్. బైపాస్‌కు భూములు ఇచ్చాం. మళ్ళీ విమానాశ్రయ విస్తరణలో భాగంగా చేపట్టనున్న ఏలూరు కాలువ మళ్లింపునకు మా భూముల్ని లాక్కోవాలని చూస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా విలువైన భూముల్ని వదులుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. గతంలో ఏలూరు కాలువ కోసం భూసేకరణను గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దగ్గరుండి రైతులతో అడ్డుకున్నారు. ఏలూరు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఈసారి తమతో వంశీ కలిసి రావాలని రైతులు కోరుతున్నారు.