భార్యపై అనుమానం... అన్నంలో విషం పెట్టి చంపిన భర్త

బుధవారం, 1 జూన్ 2016 (10:31 IST)
అనుమానంతో భార్య, ఇద్దరు కన్న బిడ్డలను అతికిరాతకంగా హతమార్చాడో ఓ ప్రబుద్ధుడు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలోని చింతలపాలెంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే... ఇదే గ్రామానికి చెందిన తమ్మినేని శ్రీనివాసుల రెడ్డికి గుంటూరు జిల్లా బాపట్ల మండలం మర్రిపూడి గ్రామానికి చెందిన ఆదిలక్ష్మితో పదేళ్ల క్రితం రెండో వివాహం జరిగింది. 
 
ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు గణేష్‌ (8), భవానీ (5). శ్రీనివాసుల రెడ్డి మొదటి భార్య ఆత్మహత్య చేసుకోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. శ్రీనివాసుల రెడ్డి కొద్దిరోజులుగా చెడు వ్యసనాలకు అలవాటుపట్టాడు. దీంతో తరుచూ భార్యను కొట్టడం, గొడవపడడం చేస్తూ ఉండేవాడు. విసుగుచెందిన ఆదిలక్ష్మి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. కొంతకాలంగా పుట్టింట్లో ఉంటోంది. 
 
కాగా ఇటీవల అత్తగారింటికి వెళ్లి గొడవపడనని, బాగా చూసుకుంటానని వారిని నమ్మించి ఇంటికి తీసుకొచ్చాడు. భార్యపై ఉన్న అనుమానంతో సోమవారం రాత్రి అన్నంలో మత్తుమందు కలిపాడు. విషయం తెలియని భార్య, పిల్లలు అన్నం తిని మేడపైకెళ్లి పడుకున్నారు. అర్థరాత్రి దాటాక భార్య ఆదిలక్ష్మి (25), కుమార్తె భవానీ (5), కుమారుడు గణేష్‌ (7)ల మెడకు తాడు బిగించి హతమార్చాడు. 
 
అనంతరం అతడు కూడా మత్తు మాత్రలను మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శ్రీనివాస రెడ్డిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి