లేడీ రెడ్‌శాండిల్ సంగీతా నోట రాజకీయ నేతల పేర్లు....?

ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (12:41 IST)
శేషాచలం అడవుల్లోని అరుదైన వృక్ష సంపదను కొల్లగొట్టి కోట్ల రూపాయలు సంపాదించుకున్న సంగీతా ఛటర్జీ విచారణలో కొన్ని ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారట. తనతో పాటు తమిళనాడుకు చెందిన కొంతమంది రాజకీయాల నాయకులు ఈ ఎర్రచందనం అక్రమ రవాణాలో ఉన్నారన్న విషయాన్ని పోలీసులకు తెలిపారట. ఇప్పటికే చిత్తూరు పోలీసు అదుపులో ఉన్న సంగీతా ఛటర్జీని 14 రోజుల పాటు విచారిస్తున్న విషయం తెలిసిందే. 
 
కోల్‌కత్తాలోని షాపింగ్ మాల్‌లో ఎంజాయ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సంగీతా ఛటర్జీని పోలీసులు చిత్తూరుకు తీసుకువచ్చారు. ఆ తర్వాత మొదటగా ఆమెపై పాకాలలో కేసు నమోదు కావడంతో పాకాల జడ్జి దేవేందర్ రెడ్డి ఇంటి ముందు హాజరుపరిచారు. 
 
14 రోజుల రిమాండ్ విధించడంతో చిత్తూరు కోర్టుకు తిరిగి తీసుకెళ్ళారు. ఆమె రిమాండ్‌లో ఉన్న సమయంలో పోలీసులు విచారిస్తుండగా పలువురు రాజకీయ నేతల పేర్లు చెప్పారని తెలుస్తోంది. తమిళనాడులో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల పేర్లనే సంగీతా చెప్పారట. పోలీసులు మాత్రం ఆ వివరాలను గోప్యంగా ఉంచి తమిళనాడు పోలీసుల సహకారంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారట. 

వెబ్దునియా పై చదవండి