ఓ తల్లి నెమ్ముతో బాధపడుతున్న పురిటికందు బాధ చూడలేక చంపేసింది. ఈ ఘటన శ్రీశైలం మండలం సున్నిపెంట పట్టణంలో చోటుచేసుకుంది. పూర్ణానంద అశ్రమం సమీపంలో నివశిస్తున్న సన్నిధి శేఖర్, లక్ష్మీ ప్రసన్నల కూతురు లక్ష్మీ శ్రావణిని ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన శ్రీకాంత్‌కు ఇచ్చి నాలుగేళ్ల కింద పెళ్లి చేశారు.
ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉండగా, శ్రావణికి 18రోజుల క్రితం రెండో కాన్పులో అడబిడ్డ జన్మించింది. వారం రోజుల క్రితం పాపకు సున్నిపెంటలో బారసాల చేశారు. కిరణ్మయి అని పేరు పెట్టారు. అయితే పాప పుట్టుకతో నెమ్ము వ్యాధితో బాధపడుతోంది.
పైగా మొదటి సంతానం బాబు కూడా ఇదే వ్యాధితో బాధపడుతున్నాడు. పాప పుట్టినప్పటి నుంచి నెమ్ముతో బాధపడుతున్న తీరు శ్రావణి చూడలేకపోయింది. పేదరికం వల్ల వైద్యం చేసే స్థామత లేదు. అంతే సోమవారం చిన్నారిని చంపేసింది. ఆపై నీటి ట్యాంకులో పడేసింది. పాప కనపడటంలేదని ఇరుగు పొరుగు వారితో చెప్పింది. దీంతో బం ధువులు, మిత్రులు కాలనీ అంతా వెతికారు. చివరికి ఇంటి పైన ఉన్న సింటెక్స్ ట్యాంక్‌లో చూడగా పాప శవం కనిపించింది.