నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో తొలి దశలో చేపడుతున్న పనుల పురోగతిని సీఎం వైయస్ జగన్ బుధవారం సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న బల్లలు, ఇతర ఫర్నీచర్‌ను సీఎం పరిశీలించారు.
పిల్లలకు రెండు రకాలుగా ఉపయోగపడే బల్లలు, గ్రీన్ చాక్ బోర్డు, వాటర్ ప్యూరిఫైర్, ఫిల్టర్, అల్మరాలు, సీలింగ్ ఫ్యాన్లను సీఎం స్వయంగా చూశారు. పిల్లలు కూర్చునే బల్లల నమూనాలను సీఎం పరిశీలించారు. మొత్తం ఫర్నీచర్‌ను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు. వాటి నిర్వహణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు.
1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు 1.50 లక్షల బల్లలు. 4వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మరో 1.50 లక్షల బల్లలు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు డ్యుయల్ డ్రాలతో కూడిన 2.10 లక్షల బల్లలు. టీచర్ల కోసం 89,340 టేబుళ్లు, కుర్చీలు, 72,596 గ్రీన్ చాక్ బోర్డులు, 16,334 అల్మారాలు, 1,57,150 సీలింగ్ ఫ్యాన్లను కొనుగోలుకు ఇప్పటివరకూ టెండర్లు ఖరారు చేసింది.
రివర్స్ టెండరింగ్–ఆదా...
ఈ వస్తువులు, పరికరాల కోసం దాదాపు మొత్తం రూ.890 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. శానిటరీ ఐటెమ్స్ కాకుండా మిగతా వాటికి టెండర్లు కూడా ఖరారు చేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటి వరకూ రూ.144.8 కోట్లు ఆదా చేశారు.
సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్..
కావాల్సిన వస్తువులు, ఫర్నిచర్.. తదితర వాటి కొనుగోలు కోసం సెంట్రలైజ్జ్ ప్రొక్యూర్‌మెంట్‌కు వెళ్లడం ద్వారా సమయానికి వాటిని పొందడమే కాకుండా, నాణ్యత ఉంటుందని, బిడ్డింగ్‌లో పోటీ కారణంగా తక్కువ ధరకే లభ్యమయ్యే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు.
ఎక్కడా రాజీ వద్దు...
గవర్నమెంటు స్కూళ్లలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు. ఫర్నీచర్ ఏర్పాటు చేయడమే కాదు, వాటి నిర్వహణ కూడా ఎంతో ముఖ్యమన్న ఆయన పలు సూచనలు చేశారు.