గుండెపోటుతో కన్నుమూసిన నంద్యాల ఎమ్మెల్యే, టీడీపీ నేత భూమా నాగిరెడ్డి నేత్రాలను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. తండ్రిని పోగొట్టుకుని పుట్టెడు శోకంలో ఉన్నప్పటికీ.. భూమా నాగిరెడ్డి నేత్రాలను ఆయన చిన్న కుమార్తె దగ్గరుండీ చేయించారు. ఈ దృశ్యాలను చూసిన ఆస్పత్రి సిబ్బంది సైతం చలించిపోయి.. కన్నీరు కార్చారు.
తాము చనిపోయిన తర్వాత మరొకరికి చూపు ప్రసాదించాలనే ఉద్దేశంతో భూమా నాగిరెడ్డి దంపతులు నేత్రదానం చేస్తామని బతికుండగానే ప్రకటించారు. భూమా నాగిరెడ్డి భార్య శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత ఆమె కోరిక ప్రకారమే తన కళ్లను దానం చేయడం జరిగింది. అదే విధంగా, ఆదివారం గుండె పోటుతో మృతి చెందిన భూమా నాగిరెడ్డి కళ్లు కూడా దానం చేశారు. మరణించాక కూడా మరొకరికి జీవితాల్లో వెలుగులు నింపి, ఆదర్శంగా నిలిచారు భూమా నాగిరెడ్డి దంపతులు.