కాకినాడ : నారా లోకేష్ బ్యాంకు ఎప్పుడు పెట్టారా అని ఆశ్చర్యపోతున్నారా? లేదండి... ఇది కాకినాడ జెఎన్‌టియులో చదువుతున్న ఇంజీనిరింగ్ విద్యార్థులకు ఎదురైన చిత్రమైన ప్రశ్న. ఇంజనీరింగ్ ప్రశ్నాపత్రంలో ఏపి ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, వారి కుటుంబ సంస్థ హెరిటేజ్‌ల ప్రస్తావన రావడం విద్యార్థులను ఆశ్చర్యపరిచింది.
మేనేజేరియల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్సియల్ ఎనాలిసిస్ (ఎమ్‌ఈఎఫ్ఏ) పరీక్ష ప్రశ్నాపత్రంలో జర్నల్ ఎంట్రీ రికార్డింగ్ విధానానికి సంబంధించి అడిగిన ఓ ప్రశ్నలో లోకేష్ బ్యాంక్, హెరిటేజ్ లిమిటెడ్, బ్రాహ్మణి లిమిటెడ్ అంటూ ప్రశ్నాపత్రం తయారుచేసిన వారు చంద్రబాబు కుటుంబ పల్లవి అందుకున్నారు.
వేరే పేర్లు లేనట్లు ముఖ్యమంత్రి కుటుంబం, వారి పేర్లు, సంస్థ గురించి ప్రశ్నాపత్రంలో ప్రస్తావించడం నివ్వెరపరచింది. అంటే ఇదంతా తెలుగుదేశం పార్టీ అనుకూల ప్రొఫెసర్‌ల అతిభక్తి కావొచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రశ్నాపత్రంలో అలాంటి ప్రశ్నలు ఉంచడం వెనుక ప్రత్యేకంగా ఎలాంటి ఉద్దేశం లేదని జెఎన్టియు వైస్ ఛాన్సిలర్ వివరణ ఇచ్చారనుకోండి. ఐనా దీనిపై చర్చలు రకరకాలుగా జరుగుతున్నాయనుకోండి.