వైద్యం కొరతతో ఎవ్వరూ ప్రాణాలు కోల్పోకూడదు: ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని
మంగళవారం, 30 జూన్ 2020 (08:33 IST)
రాష్ట్రంలో వైద్యం కొరత అనే కారణంతో ఏ ఒక్క నిరుపేద ప్రాణాలు కోల్పోకూడదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా,ఏం పి అవినాష్ రెడ్డి, పడా ఓ ఎస్ డి అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్ తో కలిసి పులివెందులలో అధునాతన వసతులతో నిర్మించనున్న వైద్యకళాశాల కోసం సేకరించిన స్థలాన్ని ఆయన పరిశీలన చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... దివంగత నేత వైఎస్ఆర్ తనువు చాలించాక జిల్లాలో ఆగిన అభివృద్ధి అభివృద్ధి పనులన్నింటినీ ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 100 % సంపూర్తి గావిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద సరైన వైద్య వసతులు అందలేదు అనే కారణంతో ప్రాణాలు కోల్పోకూడదన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం అన్నారు.
కేవలం వైద్య రంగాన్ని పటిష్ట పరిచేందుకే.. దాదాపు రూ. 850 కోట్లతో కడప జిల్లాలో వైద్య కళాశాల, కార్పొరేట్ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, అనుబంధ ఆసుపత్రులు నిర్మాణ రూపం దాలుస్తున్నాయన్నారు.
కరువుసీమగా చెప్పుకునే రాయలసీమకు తలమానికంగా కడప జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కేన్సర్ ఆసుపత్రి, మానసిక వైద్యశాలతో పాటు, పులివెందుల పట్టణంలో అధునాతన సదుపాయాలతో వైద్య కళాశాలను నిర్మించేందుకు ఇప్పటికే పునాదులు వేశారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన, అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్పొరేట్ తరహాలో వైద్య సౌకర్యాలు ప్రతి నిరుపేదకు అందాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం అన్నారు.
ఆన్రాష్ట్రం లోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో.. ఒక్కో మెడికల్ కళాశాలను నిర్మించి, వైద్య ఆరోగ్య రంగంలో ఏ మాత్రం వైద్యుల కొరత రాకూడదనే ఆయన ఆలోచన అన్నారు.
ఇప్పటికే 25 పార్లమెంటరీ స్థానాల్లో ఇప్పటికే 11 స్థానాల్లో మెడికల్ కళాశాల అనుబంధనగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు పనులు చేపట్టడం జరుగుతొందన్నారు.
స్వాతంత్ర్యం తర్వాత ఒకే ప్రభుత్వంలో, ఒకే సంవత్సరంలో ఇన్ని మెడికల్ కళాశాలల నిర్మాణానికి పునాది వేయడం.. గతంలో ఏ ముఖ్యమంత్రి చేసిన ఘనత లేదన్నారు.
దీన్ని బట్టి వైద్యవిద్యను, వైద్య ఆరోగ్యరంగాన్ని ఏ స్థాయిలో ముఖ్యమంత్రి పటిష్టం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు.
అందులో భాగంగానే నేడు పులివెందులలో అధునాతన వసతులతో నిర్మించనున్న వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం సేకరించిన స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ భాష, జిల్లా కలెక్టర్ హరికిరణ్ తో కలిసి.. పరిశీలించడం జరిగిందన్నారు.
ఇక్కడ ఈ స్థలం వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి.. అన్ని వసతులతో అందరికీ అనువుగా ఉందని తెలిపారు.
దాదాపు రూ.345 కోట్లతో నిర్మించే వైద్య కళాశాల నిర్మాణానికి ఆగస్టులో టెండర్లు ఆహ్వానించి, వీలయినంత త్వరగా నిర్మాణాన్ని పూర్తి వైద్య విద్య, వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి కార్యాచరణ చేపట్టడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సాయి కాంత్ వర్మ, ట్రైనీ కలెక్టర్ వికాస్ మర్మాట్, జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్న, పడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, ఏపీఎంఐడిసి ఎస్ ఈ కృష్ణారెడ్డి, ఇ ఇ సత్య ప్రభాకర్, డి ఈ రాజగోపాల్ రెడ్డి, పులివెందుల మున్సిపల్ కమిషనర్ నరసింహా రెడ్డి, రెవెన్యూ అధికారులు, ఇంజనీర్లు, తదితర అధికారులు పాల్గొన్నారు.