జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో ప్రశ్న సంధించారు. అధికార భారతీయ జనతా పార్టీకి ఐదు ప్రశ్నలను సంధించనున్నట్టు ప్రకటించిన ఆయన.. ఇప్పటికే రెండు అంశాలపై స్పందించారు. తొలుత గోవధ, తర్వాత దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల అంశాలపై బీజేపీ ప్రశ్నలు సంధించారు. ఇపుడు జాతీయ గీతంపై ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ మీటింగ్లను జాతీయ గీతంతో ఎందుకు ప్రారంభించబోవని, సినిమా థియేటర్లలో మాత్రమే పాడాలని ఎందుకు చెబుతున్నారని పవన్ ప్రశ్నించారు.
అంతేకాకుండా అధికార పార్టీ విధానాలను వ్యతిరేకించే వారిపై యాంటి నేషనల్స్ ముద్ర వేయరాదన్నారు. తమకు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న వారిని మాటలను అధికార పార్టీ మొదట వినాలని, ఆ తరువాతే చర్యలు తీసుకోవాలని అన్నారు. కుల, మత, వర్గ, ప్రాంత, భాషా విభేదాలు లేకుండా దేశంలోని పౌరుడు, రాజకీయ పార్టీలు ముందుకు వెళ్లడమే దేశభక్తి అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశభక్తి అనేది ఓ రాజకీయ పార్టీకి చెందిన అంశంగా ఉండకూడదన్నారు. దేశభక్తి అనేది మనిషిలో విలువలతో, మానవతతో కూడి ఉండే అంశమని అన్నారు.