అమరావతి : రోడ్డు ప్రమాదాల నివారణకు అడ్డుకట్టవేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారి నుంచి భారీ ఎత్తున అపరాధ రుసుము వసూలు చేయాలన్నారు. హోం. ఆర్ & బి, వైద్య, ఆరోగ్య, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సచివాలయంలోని తన కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సీఎస్ దినేష్ కుమార్, రాష్ట్రంలో జిల్లాల వారీగా చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్టవేయాలన్నారు. ఇందుకోసం ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. ఎక్కువ ప్రమాదాలు వాహనాల వేగం వల్లే జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలు జరిగిన ఫొటోలను అందరికీ కనపించేలా ఏర్పాటు చేయాలన్నారు. ఫొటోల ప్రదర్శనతో రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కలుగుతుందన్నారు. అదే సమయంలో హెల్మెట్లు, షీట్ బెల్టులు ధరించని వారితో పాటు మద్యం తాగి వాహనం నడిపే వారి నుంచి భారీ ఎత్తున అపరాధ రుసుములు వసూలు చేయాలని సీఎస్ ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
తరుచూ శిథిలమైన రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని ఆర్ & బి అధికారులను ఆదేశించారు. అతివేగం నివారణకు స్పీడ్ గన్ లు ఏర్పాటు చేయాలన్నారు. అంతకుముందు రాష్ట్రంలో రోడ్డు సేఫ్టీ ఫండ్ కోసం రూ.10 కోట్ల కేటాయింపునకు సమావేశం ఆమోదం తెలిపింది. ఆ మొత్తంలో రూ.2.11 కోట్లను కలెక్టర్ల అధ్యక్షతన ఉన్న జిల్లా స్థాయి రోడ్డు సేఫ్టీ కమిటీల వినతి పంచాయతీరాజ్, ఆర్ & బి, వైద్య, ఆరోగ్య, మున్సిపల్ శాఖలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో రూ.8 కోట్లను రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన పరికరాల కొనుగోలుకు వినియోగంచనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు అనురాధ, నీరబ్ కుమార్ ప్రసాద్, పూనం మాలకొండయ్య, ట్రాన్స్ పోర్టు కమిషనర్ బాలసుబ్మహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.