హిందువుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదు: బొండా ఉమామహేశ్వరరావు
గురువారం, 24 సెప్టెంబరు 2020 (20:31 IST)
దేవాలయాలపై, హిందూమతంపై కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో దాడులు జరుగుతుంటే, ముఖ్యమంత్రికి చీమకుట్టినట్టయినా లేదని, ఒక్కరోజుకూడా ఆయన వాటిపై స్పందించలేదని, కనీసం అందుకు బాధ్యులైనవారిని అరెస్ట్ చేయించలేదని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అన్యమతస్తులు ఎవరైనా తిరుమలస్వామివారి దర్శనానికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన తప్పనిసరని, ఏపీ ఎండోమెంట్ యాక్ట్ జీవోనెం-311 అదేవిషయాన్ని స్పష్టంచేస్తోందన్నారు.
ముఖ్య మంత్రి అయినంతమాత్రాన మతాలనుగౌరవించను, హిందూ మతాన్ని అణగదొక్కుతాను, టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తాను అంటే కుదరదన్నారు. స్వామివారికి జగన్ సమర్పించిన పట్టువస్త్రాలు అపవిత్రమయ్యాయని, జగన్ చర్యలవల్ల స్వామికి అపరాధం జరిగిందని బొండా తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ చర్యలవల్ల కోట్లాదిమంది హిందువులమనోభావాలు దెబ్బతిన్నాయని, వారంతా కన్నీళ్లతోనే తమదేవుడిని ప్రార్థిస్తున్నారన్నారు. పరాయిమతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే, హిందువుల ఆచారాలను మంటగలిపి, టీటీడీ నిబంధనలను మార్చాలా అని బొండా నిలదీశారు.
ఏ చట్టాలపై ప్రమాణం చేసి, జగన్ ముఖ్యమంత్రి అయ్యాడో, ఆ చట్టాలనే తుంగలో తొక్కేలా వ్యవహరించాడన్నారు. తనఇంటిపై ఏసుప్రభువు శిలువ గుర్తువేసుకున్న జగన్మోహన్ రెడ్డి, తన మత ఆచారాలను ఎంత నిష్టగా పాటిస్తారో, ఇతర మతాలను కూడా ఆయన అంతే గౌరవించాలి కదా అని ఉమా నిలదీశారు.
కరోనా కారణంగా స్థానికఎన్నికలు వాయిదాపడితే, అరగంటలో మీడియాముందుకొచ్చి నానామాటలు అన్నముఖ్యమంత్రి, గంటలో గవర్నర్ ని కలిసిన జగన్, హిందూమతంపై దాడులు జురుగుతుంటే, ఎందుకు మౌనంగా ఉంటున్నాడన్నారు. కొడాలినాని ఇష్టారీతిన నీచాతినీచంగా మాట్లాడినా కూడా ముఖ్యమంత్రి ఆయన్ని ఎందుకు మంత్రివర్గంనుంచి తొలగించడంలే దన్నారు.
అన్యమతస్తులైన వారు ఏ హోదాలో ఉన్నాసరే, టీటీడీ నిబంధనలను గౌరవించి, డిక్లరేషన్ ప్రకటించాకే ఆలయంలోకి రావాలనిచెప్పిన బొండా, అధికారమదంతో హిందూ సంప్రదా యాలను అణగతొక్కుతూ, దేవాలయాలపై దాడులు చేస్తే, ఆ దేవుడినుంచి మాత్రం తప్పించుకోలేరన్నారు.
ముఖ్యమంత్రి తిరుపతి వెళితే, రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం మొత్తం పరాయిదేశంపై యుద్ధానికి వెళ్లినట్లుగా తిరుపతిలో మోహరించడం జరిగిందన్నారు. అబ్డుల్ కలామ్ దేశప్రథమపౌరుడిగా ఉండికూడా డిక్లరేషన్ పై సంతకంపెట్టి, తిరుమలసంప్రదాయాలను గౌరవించారని, ముఖ్యమంత్రి మాత్రం అధికారమదంతో అహంకారం తో ప్రవర్తించాడన్నారు.
నిన్న జగన్ తోపాటు తిరుమల ఆలయంలోకి వెళ్లినవారిలో సగంమంది పరాయి మతస్తులే ఉన్నారని, వారందరినీ వెంటబెట్టుకొని వెళ్లడంద్వారా ఆలయ పవిత్రతను ముఖ్యమంత్రి సర్వనాశనం చేశాడన్నారు. ఆయనతో పాటు, ఆయన కుటుంబం, రాష్ట్రం బాగుండాలంటే, సతీసమేతంగా ముఖ్యమంత్రి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తే బాగుండేదన్నారు.
హిందూమతంపై జగన్ కు ఎందుకంత ద్వేషమో, హిందులంటే ఆయనకు ఎందుకంత చిన్నచూపో తెలియడం లేదన్నారు. రాష్ట్రంలోని హిందువుల కన్నీరు, పీఠాధిపతులు, స్వామీజీల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదని బొండా హితవుపలికారు. శ్రీకృష్ణదేవరాయలు ఎన్నోసార్లు కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకున్నాడని, వజ్ర వైఢూర్యాలు, రత్నాలు వెంకన్నకు సమర్పించాడనే విషయాన్ని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే నాని తెలుసుకుంటే మంచిదన్నారు.
మూర్ఖుడైన కొడాలినానీని అదుపుచేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనే ఉందన్న బొండా, శ్రీకృష్ణదేవరాయల గురించి మాట్లాడే అర్హత ఆ అనామకుడైన నానీకి లేదన్నారు. డిక్లరేషన్ ఇవ్వకుండా ఎప్పుడైతే జగన్ హిందూ సంప్రదాయాలను మంటగలిపారో, అప్పుడే ఆయన తన నైజమేమిటో రాష్ట్ర ప్రజలకు చెప్పకనే చెప్పాడన్నారు.
డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఎవరు పెట్టారు, విగ్రహాలు పగిలితే ఏమవుతుంది, రథాలు తగలబడితే ఎవరికి నష్టమంటూ, నీచాతినీచంగా మాట్లాడిన కొడాలి నానీని వెంటనే మంత్రివర్గంనుంచి బర్తరఫ్ చేయాలని బొండా డిమాండ్ చేశారు.