ఎప్పటికీ హోదా డిమాండ్‌ ఉంటుంది: జగన్‌

శుక్రవారం, 29 మే 2020 (07:40 IST)
అవినీతి ర‌హిత పాల‌న‌కు ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని ఏపి సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. వైకాపా ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌వుతున్న సంద‌ర్భంగా పారిశ్రామికాభివృద్ధిపై తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. మౌలిక స‌దుపాయాల ప‌రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం చాలా బ‌లంగా ఉంద‌న్నారు.

‘మాది ప్రొయాక్టివ్‌ గవర్నమెంట్, ఎక్కడా పరిశ్రమలను వేధించం. భూమి, నీరు, పవర్, స్కిల్డ్ వర్క్‌ఫోర్స్‌ లో స్పష్టంగా ఉన్నాం’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. పరిశ్రమలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ, వారి అవసరాలు తీర్చేలా రాష్ట్రంలో మొత్తం 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, అందుకోసం ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామని ఆయన వెల్లడించారు.

డిప్లొమా, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు నైపుణ్యం పెంచేలా ఆయా కేంద్రాలు పని చేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందన్న సీఎం, మొత్తం 22 మంది ఎంపీల గెలుపుతో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దేశంలోనే అతి పెద్ద నాలుగవ పార్టీగా నిల్చిందని చెప్పారు. రాష్ట్రంలో విశాలమైన 972 కి.మీ సముద్ర తీరం, విస్తారమైన రైలు మార్గాలు, రోడ్‌ కనెక్టివిటీ, 4 పోర్టులు, 6 విమానాశ్రయాలు ఉన్నాయని సీఎం గుర్తు చేశారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా పని చేస్తున్నామని గర్వంగా చెప్పగలమని స్పష్టం చేశారు. 

గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు రూ.968 కోట్లు బకాయి పెట్టిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఆ రంగాన్ని ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కోవిడ్‌ సమయంలోనూ ఎంఎస్‌ఎంఈలకు రూ.450 కోట్లు ఇచ్చామన్న ఆయన, వచ్చే నెల 29న మిగిలిన మొత్తం చెల్లిస్తామని చెప్పారు. విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకూ గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని, వాటికి రూ.20 వేల కోట్లు బకాయి పెట్టిందని తెలిపారు.

మరి ఇదేనా ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని విడిచిపెట్టలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎప్పటికైనా కేంద్రానికి తమ అవసరం ఉంటుందని, అప్పుడు కచ్చితంగా అడుగుతామని చెప్పారు. ‘మన పాలన–మీ సూచన’ కార్యక్రమం నాలుగవ రోజున ‘పరిశ్రమలు–మౌలిక సదుపాయాలు’పై మేధోమథనం జరిగింది. కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులు, నిపుణులు, అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ ముఖాముఖిలో పాల్గొన్నారు.

మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వీడియో ప్రదర్శన...
గత ఏడాది కాలంలో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో చోటు చేసుకున్న అభివృద్ధిపై వీడియో ప్రదర్శించారు. పలు చోట్ల పరిశ్రమలతో పాటు, మౌలిక వసతుల కల్పన, ఎంఎస్‌ఎంఈలపై అందులో వివరించారు.
 
విభజనతో చాలా నష్టపోయాం...
మన ఆర్థిక రథం నడవాలంటే వ్యవసాయం ఒక చక్రం అయితే, రెండో చక్రం పారిశ్రామిక సేవా రంగం అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. వాటిలో అభివృద్ధి కనిపిస్తేనే ఆర్థిక రథం పరుగెత్తుతుందని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయిందని, రాష్ట్రం విడగొట్టినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఆ తర్వాత ఇవ్వలేదని, దీని వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని గుర్తు చేశారు.

ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే, పారిశ్రామికంగా పలు రాయితీలు ఇన్‌కమ్‌టాక్స్, జీఎస్టీ వంటి రాయితీలు వచ్చేవని, వాటి వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి ఉండేవని తెలిపారు.
 
 ‘హోదా’ అంశాన్ని విడవలేదు...
2014–19 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేసినా గత ప్రభుత్వం హోదా తెచ్చుకోలేకపోయిందని సీఎం ప్రస్తావించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ మెజార్టీ సాధించిందని, 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు గెల్చారని గుర్తు చేశారు. ఒకవేళ కేంద్రంలో పూర్తి మెజార్టీ రాకుండా ఉండి ఉండే, వాళ్లతో బేరం పెట్టే అవకాశం ఉండేదన్న ఆయన, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీకి పూర్తి మెజార్టీ రావడంతో వారు తమ మద్దతు కోరే అవకాశమే లేకుండా పోయిందని చెప్పారు.

‘అయితే ఎప్పటికీ ఆ డిమాండ్‌ ఉంటుంది. అడగడం మానేస్తే అది ఏరోజూ మనకు అది రాదని తెలిసిన వ్యక్తిని నేను. ఈరోజు కాకపోయినా ఏదో ఒక సందర్భంలో కేంద్రం మనమీద ఆధారపడే రోజు వస్తుంది. అప్పుడు తప్పనిసరిగా హోదా కావాలని అడుగుతాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు. 
 
గత ప్రభుత్వంలో అసత్యాలు..
ఇదే సమయంలో తమ పని తాము చేసుకుంటూ పోతున్నామన్న సీఎం,  మనం ఏదైనా చెప్పేటప్పుడు ఆ మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే.. తాము కూడా రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు సాధించామని మాట్లాడితే అర్ధం లేదని స్పష్టం చేశారు. ‘రూ.20 లక్షల కోట్ల పెట్టుబడి, 40 లక్షల ఉద్యోగాలు అని ఒకరోజు. నెలకో విదేశీ కంపెనీ అంటూ హడావిడి.

రూ.50 వేల కోట్లతో సెమీ కండక్టర్‌ పార్కు నెక్స్‌›్టఆర్బిట్‌ ఏర్పాటు చేస్తుందని, బులెట్‌ ట్రెయిన్‌ వస్తుందని ఒక రోజు, ఎయిర్‌బస్‌ వచ్చేస్తుందని ఒక రోజు, మైక్రోసాఫ్ట్‌ వచ్చేస్తోందని మరొక రోజు, హైపర్‌ లూప్‌ వస్తుందని ఇంకొక రోజు ప్రచారం. ఇవన్నీ సరిపోవని ఈ మధ్యనే దివాళా తీసిన బీఆర్‌ శెట్టి ఈ పక్కనే 1500 పడకలతో రూ.6 వేల కోట్లతో దిగుతున్నాడని చెప్పారు. ఇవన్నీ నేను కూడా చెబితే అర్ధం ఉండదు’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
 
అదేనా ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’?
గత ప్రభుత్వం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అని చెప్పేదన్న సీఎం, అసలు అది ఏమిటో అర్ధం కాలేదని చెప్పారు. గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలు రూ.4 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టిందని, వాటిలో దాదాపు రూ.968 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)కు చెందినవని తెలిపారు.

రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని 2014 నుంచి 2019 వరకు పరిశ్రమలు పెట్టించి, ఆ తర్వాత ఇవ్వకపోతే.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఏమిటి? ఇక్కడ అంతా బాగుందని ఎలా చెబుతాం? అని అన్నారు. డిస్కమ్‌లకు కూడా గత ప్రభుత్వం బకాయి పడిందని ముఖ్యమంత్రి తెలిపారు.

విద్యుత్‌ కొనుగోళ్లు జరిపి డిస్కమ్‌లకు సరఫరా చేసిన విద్యుత్‌కు 14 నెలలు బిల్లులు చెల్లించలేదని, ఆ విధంగా దాదాపు రూ.20 వేల కోట్లు బకాయి పెట్టారన్న ఆయన, మరి ఇదేనా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అని ప్రశ్నించారు. ‘ఏటా క్రమం తప్పకుండా దావోస్‌ వెళ్తారు.

ప్రతి రెండు నెలలకు విదేశీ పర్యటనలు. చెప్పిందే చెప్పారు. కానీ ఏం సాధించలేదు. అన్నీ అబద్ధాలు చెప్పారు. కానీ మీడియా వారికి అనుకూలండా ఉండడం వల్ల అలా అబద్ధాలు చెబుతూ పోయారు. అవన్నీ నేను చెప్పలేను’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు