నిద్రపోతుంటే పొరబాటున అది తగిలిందేమోనంటున్న తెదేపా కార్పొరేటర్ చంటి... వదలని మహిళలు...

శనివారం, 14 మే 2016 (17:12 IST)
విజయవాడ కార్పొరేటర్ చంటి అలియాస్ ఉమ్మడి వెంకటేశ్వర రావుపై చర్యలు తీసుకోవాలంటూ మహిళలు బెజవాడలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీ టు హైదరాబాద్ టు గన్నవరం ఎయిరిండియా విమానంలో ప్రయాణం చేస్తున్న సమయంలో తన సీటు పక్కనే కూర్చున్న మహిళ పట్ల చంటి అసభ్యంగా ప్రవర్తించారంటూ శంషాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదయిన సంగతి తెలిసిందే. దీనిపై మహిళలు ఆందోళనలు చేస్తుండటంతో చంటి స్పందించక తప్పలేదు. 
 
ఆయన మీడియాతో మాట్లాడుతూ... విమానం ఎక్కిన వెంటనే నిద్రలోకి జారుకున్నానంటూ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో పొరబాటున తన కాలు ఏమయినా ఆమెకు తగిలిందేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. ఒకవేళ అదే జరిగి ఉంటే ఆమెకు క్షమాపణలు చెపుతున్నానంటూ వ్యాఖ్యానించారు. కానీ ఆయన తన పట్ల మరోలా ప్రవర్తించారంటూ సదరు ప్రయాణికురాలు పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. ఆమె ఆరోపణలు నిజమని తేలితే చంటికి కనీసం 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని అనుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి