మనింట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే... నష్టం ఎక్కువ జరగకుండా నిర్మాణాలు సర్దుబాటు చేస్తాం. కానీ, అదే విజయవాడ మున్సిపల్ అధికారులైతే... అలా కాదు... బాగున్నది పూర్తిగా కూల్చేస్తారు. ఎంత ఖర్చయినా పెట్టి కొత్తది కట్టిస్తారు. ఎందుకుంటే... సొమ్ము వారికాదు కదా... కార్పొరేషన్ది... అంటే ప్రజలది. అత్యవసరమైన పనులను వదిలిపెట్టి... అనవసరమైన ఆర్భాటాలకు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న బెజవాడ కార్పొరేషన్ పై ఓ రిపోర్ట్.
విజయవాడ మాచవరం ఎస్.ఆర్.ఆర్. కళాశాల ఎదుట ఉన్న రోడ్డు డివైడర్. కట్టి ఏడాది కాకుండానే... బాగున్న ఈ డివైడర్ని ఇలా బుల్డోజర్తో కూల్చేస్తున్నారు. చుట్టుగుంట బి.ఎస్.ఎన్.ఎల్ సెంటర్ నుంచి గుణదల వరకూ, నిక్షేపం లాంటి డివైడర్ని కూల్చేసి... మళ్ళీ కడుతున్నారు... ఎందుకుంటే... నవ్యాంధ్ర కదా... కాస్త షోగా ఉండాలట... చుట్టుపక్కల పరిసరాలు నీట్గా లేకపోయినా, శానిటేషన్ అధికారులకు పట్టదు... రోడ్డు మధ్య డివైడర్ మారిస్తే, చాలు...ఇలా తాత్కాలికమైన పనులు చేస్తే చాలు...తాత్కాలిక రాజధాని సొగసు వచ్చేస్తుందట. దీనికోసం కూలగొట్టడానికి...మళ్ళీ కట్టడానికి కాంట్రాక్టర్కు లక్షలు పోస్తున్నారు. ఇది నిధుల దుర్వినియోగమే అంటున్నారు జనం.
ఇక లెనిన్ సెంటర్ వద్ద ఉన్న పాత వంతెన. ఇది పూర్తిగా కూలిపోయే దశకు చేరింది. ఈ ఫుట్ పాత్ పైన నడిస్తే, ఏకంగా పాతాళంలోకి పోతామేమోనన్న భయం ఉంటుంది. కిందే ఏలూరు కాలువ ఉంది. బీసెంట్ రోడ్డుకు, అలంకార్ సెంటరుకు ఈ వంతెనతోనే కనెక్టివిటీ. నిత్యం వేలాది వాహనాలు, ప్రజలు ఈ వంతెనపై వెళతారు. పూర్తిగా శిథిలం అయిపోతున్న ఈ వంతెనకు వెంటనే మరమ్మతులు చేయాలనే ఆలోచనే అధికారులకు లేదు. వంతెన ఎప్పుడు కూలుతుందో అన్నట్లుంది. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే... నష్టం భారీగా ఉంటుంది. ఇలాంటి అత్యవసర పనులకు ముందు ప్రాధాన్యం ఇవ్వాలని, ఏదైనా ప్రమాదం జరిగాక ఆకులు పట్టుకుని లాభం లేదని స్థానికులు చెపుతున్నారు. నవ్యాంధ్ర నేపథ్యంలో నగర సుందరీకరణ అవసరమే. కానీ, అంతకన్నా ముందు ఇలాంటి అత్యవసర పనులు ప్రాధాన్యం ఇచ్చి... వెంటనే చేయాల్సి ఉంది.