జనసేనానికి తేరుకోలేని షాక్... అరుపులు, కేకలు తప్ప ఓట్లేవీ..?

శుక్రవారం, 24 మే 2019 (09:17 IST)
రాష్ట్రంలో తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన జనసేన కకావికలమైంది. సార్వత్రిక ఎన్నికల్లో 140 అసెంబ్లీ, 18 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసిన జనసేనకు రాజోలు అసెంబ్లీ సీటు మాత్రమే దక్కింది. ఆయన జట్టుకట్టిన బీఎస్పీ, వామపక్షాలకు ఒక్కటైనా దక్కలేదు. 
 
జనసేనానిగా పవన్‌ కల్యాణ్‌ కూడా రెండు స్థానాల్లో.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాకల్లో పోటీచేసి రెండు చోట్లా పరాజయం పాలయ్యారు. ద్వితీయ స్థానానికే పరిమితమై అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయారు. కానీ, రాజోలు అసెంబ్లీ సీటు మాత్రమే దక్కింది. దీంతో జనసేన కూడా ఏపీ అసెంబ్లీలో ఖాతా తెరిచింది. 
 
పవన్ కళ్యాణ్‌ పార్టీ ఓటమికి అనేక కారణాలు లేకపోలేదు. సంస్థాగతంగా ఆ పార్టీకి ఏమాత్రం పట్టులేకపోవడం ప్రధాన కారణం కాగా, యువ అభిమానులు సీఎం సీఎం అంటూ కేరింతలు కొడితే అదే నిజమనుకుని పవన్‌ భ్రమించారని వ్యాఖ్యానిస్తున్నారు. 
 
ముఖ్యంగా, కేకలు, ఈలలతో ఓట్లు రావని ఈ ఫలితాలతో పవన్‌కు అర్థమై ఉంటుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయకుండా.. వేదికలెక్కి ఒక్కడే ప్రసంగిస్తే అధికారం చేతుల్లోకి వచ్చిపడదని.. సంస్థాగతంగా బలోపేతం కావడం ముఖ్యమన్న సంగతి ఆయన గ్రహించలేకపోయారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి
 
పవన్‌ భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ చేతిలో 7,792 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ జనసేనకు 61,951 ఓట్లు లభించగా.. అదే వైసీపీకి 69,743 ఓట్లు లభించాయి. జనసైనికులు బిత్తరపోయారు. గాజువాకలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు