గత 2009లో వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో 294 సీట్లకు కాంగ్రెస్ 156 సాధించగా... ఇప్పుడు విభజిత రాష్ట్రంలో కేవలం 175 సీట్లలోనే వైసీపీ దాదాపు ఆ స్థాయిలో బలం సాధించి రికార్డు సృష్టించింది. మొత్తం సీట్లలో ఏడింట ఆరువంతుల సంఖ్యను సాధించింది. 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ సృష్టించిన రికార్డును తిరగరాసింది.
ముఖ్యంగా, నెల్లూరు, కడప, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. తమను బాగా ఆదుకుంటాయని భావించిన కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఆ పార్టీకి రెండేసి సీట్లు మాత్రమే దక్కడం టీడీపీ శ్రేణులను హతాశులను చేసింది. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ రెండు స్థానాలు మాత్రమే దక్కాయి.
అయితే, టీడీపీ నుంచి వైసీపీలో చేరి పోటీ చేసిన అవంతి శ్రీనివాస్, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి గెలిచేశారు. అంతా ఊహించినట్లుగానే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో ఖాతా కూడా తెరవలేక చతికిలబడ్డాయి. దేశంలో అసలు జాతీయ పార్టీలకు ప్రాతినిధ్యమే లేని శాసనసభలుగా ఆంధ్రప్రదేశ్, సిక్కింలు అవతరించాయి.