కాంగ్రెస్ అధిష్టానం మాటలే సీఎం కిరణ్ పలుకుతున్నారా?

గురువారం, 4 అక్టోబరు 2012 (09:34 IST)
File
FILE
ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 'దూకుడు'కు బ్రేకుల్లేకుండా పోయాయి. ముఖ్యంగా తెలంగాణ మార్చ్ ఉద్యమానికి అనుమతి, ఆ తర్వాత ఉద్యమకారుల అణిచివేత, సొంత పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీల అరెస్టు తదితర విషయాల్లో ఆయన ప్రదర్శించిన తెగింపు గతంలో ఎన్నడూ లేదని సొంత పార్టీ నేతలే అంటున్నారు.

మరోవైపు తెలంగాణ అంశంపై సీఎం చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ అంశానికి ఢిల్లీలోనే పరిష్కారం కనుగొంటారని వ్యాఖ్యానిస్తూ వచ్చిన సీఎం ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించడానికి గల కారణాలేంటన్నదానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.

రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించలేమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణలోనే తీవ్రమైన వ్యతిరేకత ఉందంటూ సీఎం చేసిన సంచలన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలనే విస్మయానికి గురి చేశాయి. అదేసమయంలో తెలంగాణ అంశ పరిష్కారం అంత తేలికైన విషయం కాదంటూ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ కూడా వ్యాఖ్యానించారు.

ఇలా ఉన్నట్టుండి తెలంగాణ అంశంపై సీఎంతో పాటు.. గులాం నబీ ఆజాద్‌లు రివర్స్ గేర్‌లు వేయడానికి గల కారణాలపై తెలంగాణ వాదులు ఆరా తీస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కిరణ్ కుమార్ చేసి వ్యాఖ్యలను అంత తేలిగ్గా తీసిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అధిష్టానం మనస్సులోని మాటలనే సీఎంతో చెప్పించినట్టుగానే భావించాలంటున్నారు. మొత్తంమీద సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దూకుడుకు టీ ఎంపీలతో పాటు.. తెలంగాణ ప్రాంత రాజకీయ నేతలు కూడా డంగైపోయారని చెప్పొచ్చు.

వెబ్దునియా పై చదవండి