రాజశేఖరుడు ఉదార స్వభావి: ముఖ్యమంత్రి రోశయ్య

శనివారం, 5 సెప్టెంబరు 2009 (19:11 IST)
File
FILE
ముఖ్యమంత్రి దివంగత వైఎస్.రాజశేఖర రెడ్డి ఉదారస్వభావి అని రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.రోశయ్య అభిప్రాయపడ్డారు. పేదలు రెండు పూటలా కడుపునిండా అన్నం తినేందుకు గాను ఎన్నికల్లో హామీ ఇవ్వక పోయినా కిలో బియ్యం రెండు రూపాయల పథకాన్ని అమలు చేసిన మహానేత వైఎస్ అని రోశయ్య శ్లాఘించారు.

శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సంతాప సభలో రోశయ్య పాల్గొని మాట్లాడారు. ఉదయం నిద్రలేచిన మొదలుకుని రాత్రి పడుకునే వరకు ప్రజాసేవ గురించే వైఎస్ మాట్లాడేవారని గుర్తు చేశారు. దేశంలోని ఇన్ని ప్రాజెక్టులు నిర్మించాలన్న ఆలోచనా బహుశా ఏ ఒక్క నేతకు వచ్చి ఉండదన్నారు. అలాంటిది వైఎస్ చేపట్టిన జలయజ్ఞం ద్వారా ఆ కల మన రాష్ట్రంలో సాకారం కానుందన్నారు.

సముద్రం పాలవుతున్న వృధా నీటిని కాలువలు ద్వారా మళ్లించి వేలాది ఎకరాల్లో బంగారు పంటలు పండించాలని కలలగన్నారన్నారు. అంతేకాకుండా, ప్రజల సంక్షేమం కోసం ఖర్చుకు వెనుకాడే మనస్తత్వం వైఎస్‌ది కాదన్నారు.

గతంలో ఓసారి మిత్రుడికి ఎన్నికల్లో సాయం చేసేందుకు తన స్థిరాస్థులను తెగనమ్మారని రోశయ్య గుర్తు చేశారు. ఇలాంటి మహానేత ఆశయాలను, లక్ష్యాల సాధన కోసం కృషి చేయడమే వైఎస్సార్‌కు ఘనమైన నివాళి అని రోశయ్య పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి