రోజా కాంగ్రెస్‌లోకి వస్తానంటోంది: ముఖ్యమంత్రి

బుధవారం, 5 ఆగస్టు 2009 (15:09 IST)
File
FILE
తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు, సినీ నటి ఆర్కే.రోజా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఉవ్విళ్లూరుతోందని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో మీడియా సిబ్బంది ఒక్కసారి అవాక్కయ్యారు. వెనువెంటనే ముఖ్యమంత్రి కల్పించుకుని.. ఇతర పార్టీలకు చెందిన రోజాలాంటి వాళ్లు తమ పార్టీలోకి వస్తామంటున్నారని తెలిపారు.

ముఖ్యంగా, చంద్రబాబు వైఖరితో తెదేపాలో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందన్నారు. అందువల్లే ఆ పార్టీ వారు తమ పార్టీ వైపు చూస్తున్నారన్నారు. బుధవారం ఆయన ఆసెంబ్లీ ఆవరణంలో మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ తలుపులు తెరిస్తే బయట ఏ ఒక్కరూ మిగలన్నారు. అయితే, స్థానిక అవసరాల దృష్ట్యా కొంతమంది నేతలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

రాష్ట్ర ఖజానా కష్టాల్లో కొట్టుమిట్టాడుతోందన్నారు. అందువల్లే ప్రజలకు హామీలు ఇవ్వలేక, పర్యటనలు కూడా మానుకున్నట్టు సీఎం తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎపుడు జరిగినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఎన్నికలు అక్టోబరులో జరిగే అవకాశాలు ఉన్నట్టు సూచనప్రాయంగా వెల్లడించారు. కేజీ బేసిన్‌పై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

వెబ్దునియా పై చదవండి