ఆర్టీసీ డబుల్ డ్యూటీకి రైట్..రైట్!

ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మికులకు మధ్య చిచ్చు పెట్టిన డబుల్ డ్యూటీ సమస్య ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. చట్ట ప్రకారం డబుల్ డ్యూటీకి రెట్టింపు వేతనం ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించడంతో కార్మికులు తమ ఆందోళనను విరమించారు.

శుక్రవారం ఈ విషయంపై చర్చించేందుకు సమావేశమైన ఆర్టీసీ ఎండీ దినేష్‌రెడ్డి డబుల్ డ్యూటీ చేసినవారికి రెట్టింపు వేతనం ఇవ్వనున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7నుంచి తాము చేస్తున్న ఆందోళనను విరమిస్తున్నట్టు ఎన్ఎంయూ నేత నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.

డబుల్ డ్యూటీ చేసిన కార్మికులకు రెట్టింపు వేతనం ఇచ్చేందుకు ఆర్టీసీ ససేమిరా అనడంతో సమస్య మొదలైంది. ఈ విషయంలో వెనక్కి తగ్గేందుకు నిరాకరించిన కార్మికులు గురువారం నుంచి ఆందోళన బాట పట్టారు.

దీంతో చాలా సర్వీసులు రద్దై ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురైనారు. దీంతో దిగివచ్చిన ఆర్టీసీ యాజమన్యం డబుల్ డ్యూటీకి రెట్టింపు వేతనం ఇచ్చేందుకు అంగీకరించింది.

వెబ్దునియా పై చదవండి