ఐఎంఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిర్మల్ కోర్టులో చుక్కెదురు

బుధవారం, 9 జనవరి 2013 (18:00 IST)
File
FILE
అరెస్టు అయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు నిర్మల్ కోర్టులో చుక్కెదురైంది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, మెరుగైన వైద్యం కోసం తనను చంచల్‌గూడ జైలుకు తరలించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటీషన్‌ను నిర్మల్‌ మున్సిఫ్ కోర్టు కొట్టివేసింది.

అక్బరుద్దీన్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఆదిలాబాద్‌ జిల్లా జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. అక్బరుద్దీన్‌ను వారం పాటు తమ కస్టడీకి ఇవ్వాలన్న నిర్మల్‌ పోలీసుల పిటిషన్‌పై విచారణ గురువారం నాటికి వాయిదా పడింది. పోలీసుల పిటిషన్‌పై రేపు కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు అక్బరుద్దీన్‌ను ఆదేశించింది.

మరోవైపు.. అరెస్టు అయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వద్ద తదుపరి విచారణ నిమిత్తం ఏడు రోజుల పాటు అనుమతి ఇవ్వాలని నిర్మల్ పోలీసులు కోరుతున్నారు. ఈ మేరకు వారు నిర్మల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గాను అదిలాబాద్ జిల్లా నిర్మల్ పోలీసులు మంగళవారం అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్టు చేసిన విషయం తెల్సిందే.

ఆ తర్వాత ఆయనను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. అయితే, ఈ కేసును విచారిస్తున్న నిర్మల్ పోలీసులు నిర్మల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో అక్బరుద్దీన్‌ను 7 రోజుల కస్టడీకి కోరుతూ పిటీషన్ దాఖలు చేసినట్టు కరీంనగర్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆర్ భీమానాయక్ తెలిపారు.

మరోవైపు.. అక్బరుద్దీన్‌పై 121, 120బి, 295ఏ, 124ఏ, 188, 505 సెక్షన్ల కింద నిర్మల్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం అక్బరుద్దీన్‌ను అదిలాబాద్ జిల్లా జైలులో వీఐపీ ఖైదీగా ఉంటున్నారు.

వెబ్దునియా పై చదవండి