కాంగ్రెస్‌లో కలుస్తామో లేదా కాలమే నిర్ణయిస్తుంది : విజయలక్ష్మి

శుక్రవారం, 7 సెప్టెంబరు 2012 (20:56 IST)
FILE
కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలుస్తుందో లేదో కాలమే నిర్ణయిస్తుందని వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయలక్ష్మి వ్యాఖ్యానించారు. ఆమె శుక్రవారం హైదరాబాద్‌లో పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీ విలీనం అవుతుందో లేదో కాలమే సమాధానం చెపుతుందన్నారు. అలాగే, మతతత్వ పార్టీలతో చేతులు కలుపబోమని పార్టీ అధినేత, తన కుమారుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని ఆమె గుర్తు చేశారు.

ఇకపోతే.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మద్దతుగా ఆమె హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన రెండు రోజుల దీక్ష శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ ఫీజు రీయింబర్స్‌ ఇవ్వాలన్నదే వైఎస్‌ఆర్‌ ఆశయమని గుర్తు చేశారు.

చదువులకు పేదరికం అడ్డుకాకూడదన్న మహోన్నత ఆశయంతోనే మహానేత వైఎస్‌ఆర్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని విజయమ్మ తెలిపారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే పథకాన్ని కిరణ్ సర్కార్‌ ఎందుకు అమలు చేయలేకపోతోందని, ప్రజా సంక్షేమం ప్రభుత్వ బాధ్యత కాదా అని విజయమ్మ ప్రశ్నించారు.

గత ఏడాది నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరాటం చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం వైఎస్ ఎప్పుడు బడ్జెట్ లెక్కలు వేయలేదన్నారు. ప్రజా సమస్యల కోసం పోరాడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విజయలక్ష్మి ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి