కాంగ్రెస్‌లో కార్యకర్తగానే ఉంటా: రోజా సెల్వమణి

FILE
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గతంలో రోజా సెల్వమణి వైఎస్‌ను కలిసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారని కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గంగా భావానీ తనపై నిందారోపణలు చేయటం సరికాదని రోజా చెప్పారు. పార్టీలో తాను ఓ సాధారణ కార్యకర్తగానే ఉంటానని ఆమె తెలిపారు.

శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ...తాను వైఎస్‌ను కలిసినందువల్లే ఆయన హెలికాప్టర్‌లో మృతి చెందారని గంగా భవానీ చెప్పడం విడ్డూరంగా ఉందని, ఆమె చెప్పిన మాటలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆమె అన్నారు. తాను వైఎస్‌ను కలిసిన తర్వాత ఎంతో మంది ఆయనను కలిసారని, ఇందులో నన్ను తప్పు పట్టడం ఏమంత మంచిది కాదని ఆమె అన్నారు.

తాను టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్‌ను పార్టీ పరంగా విమర్శించిన మాట వాస్తమేనన్నారు. వైఎస్ తనను ఎంతో అభిమానంతో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని, తాను చేసిన విమర్శలను సైతం ఆయన లెక్క చేయలేదని, దీంతో ఆయన ఎంతటి మహానుభావుడో అర్థం అయ్యిందని ఆమె తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో తాను ఓ కార్యకర్తగానే ఉంటానని, పార్టీ అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, పార్టీలోని ఏ ఒక్కరికీ పోటీ కాదని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. తనకు పదవులు ఏవీ అక్కర్లేదన్నారు.

ఓ ఇంట్లో కుటుంబపు పెద్ద అకస్మాత్తుగా చనిపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుందో, అలాంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో నెలకొని ఉందని ఆమె తెలిపారు. వైఎస్ లేరని తాను మళ్ళీ తెదేపాలోకి వెళ్ళే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి