కేసీఆర్-లగడపాటిల మధ్య పెరుగుతున్న 'ప్రేమ' బంధం!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ల మధ్య ప్రేమబంధం మరింత పెరిగిపోతోంది. ఒకరికొకరు ఐ లవ్‌ యులు చెప్పుకుంటున్నారు. పరస్పరం అభినందించుకుంటున్నారు. సమైక్యాంధ్ర హీరో లగడపాటి అంటూ అందుకే లగడపాటికి ఐ లవ్ యు చెపుతున్నానంటూ కేసీఆర్ ఒక టీవీ కార్యక్రమంలో అన్నారు.

ఈ సారి లగడపాటి వంతు వచ్చింది. తనకు ఐ లవ్ యూ చెప్పిన తెరాస అధినేత కేసీఆర్‌లాగానే లగడపాటి కూడా ప్రేమ భాష మాట్లాడారు. 'కేసీఆర్ భావనను ప్రేమిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చారు. గాంధేయ మార్గంలో సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని కేసీఆర్ సంకల్పించడం అభినందనీయం, సంతోషదాయకం. ఈ భావనను నేను ప్రేమిస్తున్నాను అని లగడపాటి వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత చంద్రబాబు చేపట్టనున్న మద్యపాన నిషేధ ఉద్యమంపై ప్రశ్నించగా లగడపాటి ఫక్కున నవ్వారు. ఇది హాస్యాస్పదమని, వింతగా ఉండటం వల్లే నవ్వానన్నారు. 1996 పార్లమెంట్ ఎన్నికల సమయంలో చంద్రబాబు మద్యపానాన్ని ఎత్తివేస్తామని ఓటర్లకు ఒట్టేసి చెప్పారు. నెల తిరక్కముందే బెల్టుషాపులకు తెరలేపారు. అధికారంలో ఉన్నప్పుడే ఏమైనా చేయాలి. అది పోయిన తర్వాత అది చేస్తాం.. ఇది చేస్తామని చెపితే ఎవరూ నమ్మరని లగడపాటి అన్నారు.

వెబ్దునియా పై చదవండి