కొండా దంపతులకు జగన్ షాక్... బీజేపీ వైపు చూపులు?!!

శుక్రవారం, 10 మే 2013 (17:46 IST)
FILE
తెలంగాణ ప్రాంతం నుంచి జగన్ మోహన్ రెడ్డికి కుడిభుజం అనే పేరున్న కొండా సురేఖ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో కుతకుతలాడుతున్నారట. ముఖ్యంగా ఇటీవల జిల్లా కార్యవర్గంలోనికి కొండా దంపతులు సూచించిన నలుగురికి వైకాపా మొండిచేయి చూపించి ప్రత్యర్థి వర్గంలోని వారిని ఎంపిక చేసింది. దీంతో కొండా వర్గీయులు నలుగురు పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. దీనిపై ఆగ్రహించిన పార్టీ అధిష్టానం ఆ నలుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది. కొండా దంపతులకు మాటమాత్రం కూడా చెప్పకుండా సస్పెన్షన్ నిర్ణయం తీసుకోవడంపై కొండా దంపతులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

మరోవైపు భవిష్యత్ కార్యాచరణలో భాగంగా కొండా సురేఖ అనుచర గణం శుక్రవారంనాడు హైదరాబాదులో ప్రత్యేకంగా సమావేశమవుతున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా కొండా సురేఖకు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో కొండా సురేఖ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

మరోవైపు జిల్లాలో ఆయా నాయకుల ప్రాబల్యం పార్టీని ధిక్కరించే స్థాయికి వెళ్లకూడదన్న ఉద్దేశ్యంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. కొణతాల రామకృష్ణకు వ్యవహారం కూడా అలాంటిదేనంటున్నారు.

కొణతాలకు చెక్ పెట్టేందుకే దాడి వీరభద్ర రావును పార్టీలోకి ఆహ్వానించారని చెపుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు వరంగల్ జిల్లాలో కొండా సురేఖ దూకుడుకు ముకుతాడు వేసేందుకు ఆమె సూచించిన వ్యక్తులను ఎంపిక చేయకుండా ఆమెకు వ్యతిరేకంగా ఉండే వర్గం వారిని ఎంపిక చేసినట్లు చెపుతున్నారు. ఈ అంతర్గత కుమ్ములాటలు జగన్ పార్టీని ఏ తీరానికి చేర్చుతాయో చూడాలి.

వెబ్దునియా పై చదవండి