కొవ్వూరు ఎమ్మెల్యేపై కేరళ విద్యార్థినుల ఫిర్యాదు

కొవ్వూరు ఎమ్మెల్యే టి.వి.రామారావు కేసు వ్యవహారం శనివారం కీలక మలుపు తిరిగింది. ఆయనపై కేరళకు చెందిన కొందరు విద్యార్థినులు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి ఫిర్యాదు చేశారు. తన కళాశాల విద్యార్థినిపై అత్యాచారం చేసి, హత్య చేశాడన్న సంఘటన బయట పడిన రోజుకు మూడు రోజుల ముందు తనపై రామారావు అత్యాచారం చేశాడని ఒక విద్యార్థిని హోం మంత్రికి ఫిర్యాదు చేసింది.

అలాగే రామారావు తనపై రెండు సార్లు అత్యాచారయత్నం చేశాడంటూ అదే కళాశాలలో చదువుతున్న కేరళకు చెందిన మరో విద్యార్థిని కూడా హోం మంత్రికి ఫిర్యాదు చేసింది. విద్యార్థినుల ఫిర్యాదును తీసుకున్న సబితా ఇంద్రారెడ్డి ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిఐడి అధికారులను కలిసి వివరించాలని చెప్పారు. కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు నర్సింగ్ కళాశాలలో జరిగిన వ్యవహారంలో కీలకంగా మారిన ఐదుగురు కేరళ విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు శనివారం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు.

నర్సింగ్ కళాశాల విద్యార్థినులు నీతూమల్ జాయ్, ఎ.ఎల్. ధనలక్ష్మి, నీతూ శైలజన్, నిమిషా జాకబ్, లీనాలు రామారావు కళాశాలలో జరుగుతున్న దురాగతాలపై హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన రోజున ఆ సంఘటన గురించి బయటపెడితే చంపేస్తామని రామారావు అనుచరులు తమను బెదిరించారని వారు తెలిపారు.

గదిలో పెట్టి మూడు రోజులు నిర్బంధించి, అనంతరం రామారావు కుమారుడు శేఖర్ తమను కారులో బలవంతంగా చెన్నై తరలించారని విద్యార్థినులు వెల్లడించారు. నర్సింగ్ కళాశాల ముసుగులో అనేక దారుణాలకు ఒడిగడుతున్న రామారావుపై చర్య తీసుకోవాలని బాధిత విద్యార్థినులు డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి