కోనసీమకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం: చిరు

కోనసీమ అందాలు చూచి ముగ్ధుడైన ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తాము అధికారంలోకి వస్తే ఆ ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భగవంతుని సొంత స్థలం కేరళ అంటారని, కానీ కోనసీమే దేవుని సొంత స్థలమనే విధంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.

తూర్పు గోదావరి జిల్లాలో చివరిరోజు పర్యటన సందర్భంగా చిరంజీవి మంగళవారం కోనసీమలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు అధికారంలోకి వచ్చినా కోనసీమను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కోనసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు.

కోనసీమలో కొబ్బరికి గిట్టుబాటు ధర రాక రైతులు విలవిలలాడుతున్నారని, వారికోసం కేరళలో మాదిరిగా అనుబంధ పరిశ్రమలు నెలకోల్పాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే అమలాపురం-నర్సాపురం రైలు మార్గాన్ని పూర్తి చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు.

అయితే తాను అధికారంలోకి వస్తే ఈ రైలుమార్గం కలను నెరవేరుస్తానని స్పష్టం చేశారు. అలాగే సముద్రంపై పూర్తి అవగాహన ఉన్నవారికే కోస్టల్‌గార్డు ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

వెబ్దునియా పై చదవండి