గిరిజనుల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం: వైఎస్

ఆదివారం, 9 ఆగస్టు 2009 (17:57 IST)
File
FILE
రాష్ట్రంలోని గిరిజనులు సర్వతోముఖాభివృద్ధి సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పునరుద్ఘాటించారు. ఆయన ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన భద్రాద్రిలో కొలువైన శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఈ ఆలయంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న కళ్యాణ వేదికకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం 28 వేల మంది లబ్ధిదారులకు భూమి హక్కు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో రెండు మూడు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు. ప్రజల సంక్షేమాన్ని కాంక్షించడంలో తమ ప్రభుత్వానికి ఎవరూ సాటిరారు అనేటట్లుగా అభివృద్ధి చేస్తున్నట్టు వైఎస్ తెలిపారు.

ఇకపోతే.. ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు మరో రెండేళ్ళలో పూర్తవుతాయని, వీటి ద్వారా మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ తెలిపారు. ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనుల హక్కులను కాపాడుతామని ఆయన హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి