చంద్రబాబు ప్రధానికి 3 పేజీల లేఖ... సీమాంధ్ర ప్రజలు షాక్‌కు గురయ్యారు

శుక్రవారం, 9 ఆగస్టు 2013 (21:43 IST)
WD
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేసిన తర్వాత సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి రూ. 4 లేదా రూ. 5 వేల కోట్లు కావాలని చెప్పిన చంద్రబాబు నాయుడు, శుక్రవారం సీమాంధ్ర ఉద్యమం నేపధ్యంలో ప్రధానమంత్రికి 3 పేజీల లేఖ రాశారు. రాష్ట్ర విభజన ప్రకటనతో సీమాంధ్ర ప్రజలు షాక్‌కు గురయ్యారని ఆయన పేర్కొన్నారు.

ప్రజల అనుమానాలను, అపోహలను నివృత్తి చేయకుండా అస్పష్టమైన ప్రకటన చేయడం వల్లనే ఈ ఆందోళనలు పెల్లుబుకియాని పేర్కొంటూనే, కొత్త రాజధాని విషయంలో ఎలాంటి హామీ ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాదుపై ఎలాంటి స్పష్టత లేకుండా ప్రకటన చేశారనీ, కాంగ్రెస్ పార్టీ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోంది తప్ప ప్రజల ఆకాంక్ష ఏమిటో, దానికి తగినట్లు నడుచుకోవడం లేదని దుయ్యబట్టారు.

విభజన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తన అంతర్గత అంశంగా చూడటం దారుణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ, ఈ పరిస్థితుల నుంచి ప్రజలను బయటకు తేవాలనీ, నీటి కేటాయింపులు, ఉద్యోగ ఇతర మౌలిక సదుపాయాలపై స్పష్టతతోపాటు రాజధాని హైదరాబాదుపై మరింత స్పష్టమైన వైఖరి వెల్లడించాలని ఆయన కోరారు.

వెబ్దునియా పై చదవండి