చివరకు.. నేను కూడా పార్టీ మారుతానా?: చిరు

బుధవారం, 19 ఆగస్టు 2009 (11:11 IST)
File
FILE
రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో పార్టీని స్థాపించిన నేను కూడా వేరే పార్టీలో చేరుతానని మీడియా ప్రచారం చేస్తోందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారాజ్యం పార్టీ నేతలందరూ ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నట్టు వార్తలు వస్తున్న విషయంపై చిరంజీవి ఘాటుగా స్పందించారు.

దీనిపై ఆయన బుధవారం స్పందిస్తూ.. తాను రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి పర్యటిస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం తమ పార్టీపై వస్తున్న వార్తల్తో అణు మాత్రం నిజం లేదన్నారు. ప్రజలు ఎల్లపుడూ తమ వెంటే ఉంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తమ పార్టీని బలహీన పరిచేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, మీడియా కలిసి దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రధానంగా తాను రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేపడితే పార్టీని నెంబర్ వన్ స్థాయికి తీసుకెళతానని ఆయన జోస్యం చెప్పారు. తమ పార్టీని లక్ష్యంగా చేసుకుని రోజుకో విధంగా కల్పిత వార్తలు రాస్తున్నారని, చివరకు తాను కూడా పార్టీ మారుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో గతాన్ని నెమరు వేసుకోవడంపైనే దృష్టి సారిస్తున్నారే గానీ.. వర్తమానం, భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించడం లేదని ఆయన తెలిపారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజా సమస్యలను గాలికొదిలేశారని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి