జగన్ తండ్రి వైఎస్సార్ తెలంగాణ కల నెరవేరబోతోంది... దిగ్విజయ్

శనివారం, 10 ఆగస్టు 2013 (19:44 IST)
WD
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 1999లో తెలంగాణ ఇవ్వాలంటూ 40 మంది శాసనసభ్యులతో తీర్మానం చేసి కాంగ్రెస్ హైకమాండ్ కు లేఖ పంపారని ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు.

శనివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నదని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు తాము అనుకూలమని లేఖ ఇచ్చి యూ టర్న్ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేనే లేదని స్పష్టం చేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... 1999లో డైనమిక్ లీడర్ వైఎస్సార్ తెలంగాణ ఇవ్వాలని చెప్పారన్నారు. ఆ తర్వాత 2004లో తెరాసతో పొత్తుపెట్టుకుని ఎన్నికలకు వెళ్లామని వెల్లడించారు. ఇక 2009లో తమ మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చామన్నారు. ఇన్ని చేసిన కాంగ్రెస్ పార్టీ మాట తప్పడం అనేది ఉండదని అన్నారు.

సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలపై మాట్లాడుతూ.... వారి సమస్యలేమిటో తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఆంటోని కమిటీని ఏర్పాటు చేశారనీ, ఆ కమిటీకి సమస్యలను విన్నవించవచ్చన్నారు. వాటిని కేంద్ర ప్రభుత్వానికి నివేదించి తగు రీతిలో మార్పులు చేర్పులు చేస్తామని తెలిపారు. ఇక సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేస్తున్న ఉద్యోగులు తమ సమ్మె ప్రకటనను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

వెబ్దునియా పై చదవండి