జగన్ వ్యాఖ్యలపై స్పందించబోను: గవర్నర్ కె. రోశయ్య

శనివారం, 10 సెప్టెంబరు 2011 (12:36 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్. జగన్ లాంటి యువకులు మాట్లాడిన మాటల మీద తాను స్పందించబోనని తమిళనాడు గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. యువకులు చేసే ఆరోపణలను నిందలు భరించే శక్తి తనకు ఉందని రోశయ్య చెప్పారు.

కాంగ్రెస్‌కు విశ్వాసపాత్రుడిగా ఉన్నందువల్లే అమీర్‌పేట కేటాయింపు కేసులో ఏసీబీ కోర్టు ద్వారా క్లీన్‌చిట్ ఇప్పించి, రోశయ్యను గవర్నర్ చేశారని జగన్ చేసిన ఆరోపణలపై ప్రత్యారోపణలు చేసేందుకు తాను సిద్ధంగా లేనని రోశయ్య స్పష్టం చేశారు. గవర్నర్‌గా ఇప్పుడు రాజకీయాలు మాట్లాడేందుకు సిద్ధంగా లేను. అది నా విధి కూడా కాదని రోశయ్య చెప్పారు.

తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఢిల్లీకొచ్చిన రోశయ్య రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌, ఉపరాష్ట్రపతి హమీద్‌అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ, హోంమంత్రి చిదంబరంలను మర్యాదపూర్వకంగా కలిశారు.

వెబ్దునియా పై చదవండి