టీఆర్ఎస్ వస్తే దారుణ పరిస్థితే : టీజేఏసీతో జైరాం రమేష్!

శుక్రవారం, 28 ఫిబ్రవరి 2014 (09:01 IST)
File
FILE
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అత్యంత దారుణమైన పరిస్థితులను ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర మంత్రి జైరాం రమేష్ తనను కలిసిన టీజేఏసీ నేతలతో వ్యాఖ్యానించారు. పైపెచ్చు.. తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ చేతుల్లోకి వెళితే దొరల పాలన తప్పదని ఆయన హెచ్చరించారు.

హైదరాబాద్‌కు వచ్చిన జైరాం రమేష్ గురువారం టీజేఏసీ నేతలు కోదండరాం, దేవీప్రసాద్, శ్రీనివాస్ గౌడ్ తదితరులను పిలుపించుకుని గంటకుపైగా సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకుండానే, ఆయన తీరును, ఆ పార్టీ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. టీజేఏసీ బృందంలోని సభ్యులు తానున్న గదిలోకి రాగానే.. 'ఎందుకు తెలంగాణ?' అంటూ జైరాం రమేశ్ ప్రశ్నించడంతో వారంతా అవాక్కరయ్యారట. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రాంతంలో అరాచకం, సంక్షోభం తప్పదన్నారు.

వెబ్దునియా పై చదవండి