తెలంగాణాలో కాంగ్రెస్-తెరాసలే తన్నుకుంటాయి: కేసీఆర్

FILE
ఉప ఎన్నికలు తెచ్చిన వేడితో తెలంగాణా రాష్ట్ర సమితి కుతకుతలాడుతోంది. ముఖ్యంగా తమ పార్టీ అభ్యర్థులు రాజీనామా చేసిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను నిలబెడుతుండగా తెలుగుదేశం పార్టీ సైతం అదే బాటలో అడుగులు వేస్తోంది. ఆ పార్టీల వైఖరిపై తెరాస చీఫ్ కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణా ఐకాస చెప్పిన మాట వినకుండా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే తెలంగాణాలో డిపాజిట్లు గల్లంతవుతాయని అన్నారు.

అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అసలు తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర సమితి మాత్రమే పరస్పర పోటీపడతాయని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో ఏనాటికైనా కాంగ్రెస్‌కు తెరాస మాత్రమే గట్టి పోటీ అవుతుందని ఆయన అన్నారు.

పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించాలని చెప్పారు. ఇప్పటికే తెలంగాణా ప్రాంతంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెరాస తీర్థం పుచ్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో తెలంగాణాలో తెలంగాణా రాష్ట్ర సమితి మాత్రమే అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

వెబ్దునియా పై చదవండి