తెలంగాణ ఇప్పట్లో లేనట్లే: డిగ్గీ నోట సోనియా మాట.. 2014 ఎన్నికలే లక్ష్యం?!

FILE
తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని, ఆగేది లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించినప్పటికీ.. సీమాంధ్ర వారి కోసమే ఆంటోని కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఆ కమిటీకి కాలపరిమితి లేదన్నారు.

ఈ మాటలకు అర్థమేమిటని ఆరాతీస్తే.. అసలు విషయం బయటికొస్తుంది. 2014 ఎన్నికల వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయాన్ని నాన్చి, సీమాంధ్రలో కిరణ్ కుమార్ రెడ్డిని హీరో చేసి, తెలంగాణకు కాంగ్రెస్ అనుకూలమనే సెంటిమెంట్‌ను ఇమిడ్చి కాంగ్రెస్ ఓట్లు దండుకునేందుకే ఈ తెలంగాణ ఇష్యూను మళ్లీ లేవనెత్తిందని రాజకీయ పండితులు అంటున్నారు.

దీంతో తెలుగుజాతి కలిసి ఉండాలని కోరుకుంటున్న అఖండ ఆంధ్రప్రదేశ్ వాసులకు ఇది ఒక రకంగా శుభవార్తే అయినప్పటికీ, తెలంగాణ ప్రకటనతో సీమాంధ్రలో ఉద్యమానికి కాంగ్రెస్ కారణమని చెప్పవచ్చు.

తెలంగాణపై కాంగ్రెస్ ప్రకటన ఓట్లను దండుకునేందుకేనని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ స్వయంగా కాకుండా డొంకతిరుగుడు మార్గంలో తెలియజేశారని చెప్పడంలో ఎలాంటి సంశయమూ లేదు.

సమైక్యాంధ్రలో ఇంత ఉద్యమం ఎగిసిపడుతుందని ఊహించలేదు, కేవలం కొందరు నేతల్లోనే తెలంగాణ ఇవ్వొద్దన్న భావం ఉంది అనుకున్నాం, కాని ఇప్పుడు ప్రజల్లో ఇంత సమైక్యవాదం కనిపిస్తోంది, రాష్ట్రాన్ని విభజించడం కష్టంగానే ఉంది అని ఇటీవల దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను పరిశీలించక తప్పదు.

ఈ నాలుగు నెలల్లోనే తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్, దానికోసం ఏర్పాటు చేసిన కమిటీకి కాలపరిమితి విధించలేదంటే ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వాయిదా వేసినట్టేనని రాజకీయపరిశీలకులు అంటున్నారు. ఎనీవే సమైక్యాంధ్రులు ఇక పండగ చేసుకోవచ్చునన్నమాట..!

వెబ్దునియా పై చదవండి