తెలంగాణ న్యాయవాదులు- తెదేపా నాయకులకు మధ్య ఘర్షణ

శనివారం, 6 మార్చి 2010 (16:24 IST)
FILE
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద తెలుగు దేశం పార్టీ నేతలు వామపక్ష నేతలతో కలిసి ధరల పెంపుదలపై శనివారం మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట్లాడుతుండగా తెలంగాణ ప్రాంతానికి చెందిన న్యాయవాదులు అడ్డుకున్నారు. ప్రత్యేక తెలంగాణపై చంద్రబాబు తన వైఖరేంటో ఇక్కడే చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ తెలుగు దేశం కార్యకర్తలకు తెలంగాణ న్యాయవాదులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు న్యాయవాదులు తీవ్రంగా గాయపడ్డారు.

ఇదిలావుండగా తెలంగాణ న్యాయవాదులపై జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధినేత కేసీఆర్, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్, టిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఇందులో భాగంగానే న్యాయవాదులకు కూడా ఆ హక్కు ఉందని తెరాస అధినేత అన్నారు. తెలంగాణపై తమ వైఖరిని ప్రకటించమని అడిగితే తమ న్యాయవాదులపై దాడులు చేయిస్తారా అని ఆయన ప్రశ్నించారు.

కాగా ఐకాస కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు తెలంగాణ వైపు ఉంటారో లేక చంద్రబాబు వైపుంటారో తేల్చుకోవాలని ఆయన వారికి కోరారు. తెలంగాణ అంశంపై తెదేపా నాయకులే తమ ప్రాంతానికి చెందిన న్యాయవాదులపై దాడులు చేయించారని, తెలంగాణ రావడం చంద్రబాబుకు ఏ మాత్రం ఇష్టం లేదని ఈ దాడులతో స్పష్టమౌతోందని ఆయన ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి